Article By Sankar g
సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం.
1.యస్వీ రంగారావు గారు నటించిన బంగారు పాప చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమాను చూశాక స్వయాన చార్లి చాప్లిన్ రంగారావు నటనను ఎంతగానో కొనియాడారు. జార్జ్ ఇలియట్ రచించిన సైలాస్ మర్నర్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు బిఎన్ రెడ్డి.
2.నందమూరి తారకరామారావు తనకు 40 ఏళ్లు వచ్చాక, కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. వెంపటి చినసత్యం మాస్టారి వద్ద ఆ నాట్యాన్ని అభ్యసించారు. నర్తనశాలలో తాను పోషించిన బృహన్నల పాత్రకు న్యాయం చేయడం కోసం రామారావు నాట్యాన్ని శ్రమించి నేర్చుకున్నారు.
3.హిందీ నటుడు దిలీప్ కుమార్ దేవదాసు పాత్ర ద్వారా యావత్ భారతదేశానికి సుపరిచితుడయ్యాడు. అంతకుముందే వివిధ భాషలలో వేరు వేరు నటులు దేవదాసు పాత్రను పోషించారు. ఓ ఇంటర్వ్యూలో విలేఖరి దిలీప్ కుమార్‌ను ప్రశ్నిస్తూ, ఆయనకు ఏ నటుడు పోషించిన దేవదాసు పాత్ర ఇష్టమని అడగగా, దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తెలుగు నటుడు అక్కినేనినాగేశ్వరరావు పోషించిన దేవదాసు పాత్ర తనను బాగా ఆకట్టుకుందని దిలీప్ తెలిపారు.

4.కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆయనను కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి వారు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా షూటింగ్‌లో భాగంగా గుంటూరులో ఉన్నారు కృష్ణ. తన గురువు గారిని ఆఖరిచూపు చూసేందుకు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ రవాణా సదుపాయాలేవీ అందుబాటులో లేవు. ఆఖరికి ది హిందూ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి, వారి ప్రత్యేక విమానంలో హుటాహుటిన మద్రాసు చేరుకున్నారు.
5.నటుడు చంద్రమోహన్ సతీమణి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆమె పేరేమిటో తెలుసా? జలంధర. ఆమె అగ్ని పుష్పం, ఎర్ర మందారాలు, చిత్రశిల, మైనపు బొమ్మ, సాలభంజిక లాంటి కథలు రాశారు. పున్నాగపూలు, స్మృతి చిహ్నం వంటి నవలలు రాశారు.
6.నటుడు హరనాథ్ తండ్రి బుద్ధరాజు వరహాలరాజు గొప్ప చారిత్రక రచయిత, పరిశోధకుడు. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గొప్ప మహద్గ్రంథాన్ని ఆయన రచించారు. అలాగే తన పరిశోధనలలో భాగంగా 900 గ్రామాలను సందర్శించారు.
7.అలనాటి హాస్యనటుడు కస్తూరి శివరావు మద్రాసు పాండీబజారులో బ్యూక్ అనే ఫారిన్ మోడల్ కారు కొనుగోలు చేసిన వారిలో ప్రథముడు. మద్రాసు వీధులలో ఆ కారు తిరిగితే, అది కచ్చితంగా శివరావుదే అని ప్రజలు ఇట్టే చెప్పేసేవారు. అయితే తన చరమాంక దశలో శివరావు అదే పాండీ బజార్ వీధులలో సైకిల్ మీద తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు కారణం తాగుడికి బానిసై ఆర్థికంగా కూడా ఆయన చాలా నష్టపోవడం.
8.మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా అనేక చిత్రాలలో నటించారు. కానీ ఆయన గొప్ప రచయిత కూడా. తెలుగువారి జానపద కళారూపాలు, పోరాటాల రంగస్థలం, ఆంధ్రుల నృత్య కళావికాసం, తెలుగువారి చలన చిత్ర కళ లాంటి గొప్ప పరిశోధక గ్రంథాలను ఎన్నో రాశారు. అలాగే ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యులలో మిక్కిలినేని కూడా ఒకరు.

9.అనేక తెలుగు పౌరాణిక చిత్రాలలో శకుని పాత్రను పోషించిన నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి. ఆయన పలు సాంఘిక సినిమాలలోని ప్రతినాయక పాత్రలలో కూడా రాణించారు. కానీ వార్థక్యం వచ్చాక ఆయన తన జీవితాన్ని భగవంతుడి సేవకే అర్పించారు. సన్యాస దీక్షను స్వీకరించారు. శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతిగా పేరు మార్చుకొని ఆశ్రమం నిర్మించుకొని, అందులోనే నివసించేవారట.
10.మాయా బజార్ లాంటి చిత్రాలలో శకుని పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు. అయితే ఆయన కెరీర్ తొలినాళ్ళలో శ్రీకృష్ణుడిగా కూడా నటించారు. ద్రౌపది వస్త్రాపహరణం (1936) లాంటి చిత్రాలలో ఆయన కృష్ణ పరమాత్ముడిగా నటించారు.

11.గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన అర్ధాంగి చిత్రంలో అతనికి భార్యగా నటించిన శాంత కుమారి, నిజ జీవితంలో ఆయన కంటే 8 సంవత్సరాలు పెద్దవారు. అలాగే అదే చిత్రంలో గుమ్మడికి పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు అతని కంటే 3 సంవత్సరాలు పెద్ద. గుమ్మడికి చిన్నకుమారుడిగా నటించిన జగ్గయ్య అతని కంటే 1 సంవత్సరం పెద్ద.
12.నటుడు రేలంగి వెంకట్రామయ్య హాస్య నటుడిగా సుపరిచతులు . కానీ పేరు, డబ్బు వచ్చిన తర్వాత తోటి హాస్యనటులకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన చిత్రాలను కావాలనే తగ్గించుకున్నారట. ఎవరైనా నిర్మాతలు తనను సంప్రదిస్తే, ఆయన తన బదులు ఇతర కళాకారులను సిఫార్సు చేసేవాడట. ఇంత ఉదారత ఎంతమందికి ఉంటుంది. ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో చలం, పద్మనాభం మొదలైన వారున్నారు.