
సాధారణంగా మళయాళం సినిమాలు రీమేక్ చేయడం చాలా రిస్క్. ఎందుకంటే వాళ్ళు చిన్న పాయింట్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారు. మన దగ్గర మాస్ మసాలా అయితే.. వాళ్ల దగ్గర క్లాస్ విత్ మసాలా ఉంటుంది. కరోనా దెబ్బకి థియేటర్ల భవిష్యత్తు సంగతేమో గానీ OTTలు అదరగొట్టేస్తున్నాయి. అలా థియేటర్లో విడుదల కావాల్సిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా గురించి చెప్పుకునేముందు ఒరిజినల్ గురించి చెప్పుకోవాలి. 2016లో మళయాళంలో విడుదలైన మహేషంతి ప్రదీగారమ్ అనే సినిమాకి రీమేక్ ఇది. అందులో అందరూ ఉద్దండులే. ఆ సినిమాలో హీరో వహాద్ ఫాజిల్. అతనో అద్భుతమైన నటుడు. ప్రైమ్‌లో ఉన్న ట్రాన్స్ అనే సినిమా వీలైతే చూడండి. ఫాజిల్ విశ్వరూపం తెలుస్తుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కూడా తీసుకున్నాడు. ఈయనో ఎవరో కాదు మళయాళంలో అలనాటి టాప్ డైరెక్టర్ ఫాజిక్ కొడుకే. మన తెలుగులో ఆయన నాగార్జునతో క్రిమినల్ సినిమా తీశారు. మహేషంతి ప్రతీగారమ్‌కి వస్తే.. ఆ ఏడాదిలో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కొట్టింది. దీనికి డైరెక్షన్ చేసిన దిలీష్ పోతన్ సృజనాత్మక దర్శకుడు, మంచి నటుడు కూడా. 4 కోట్లు పెట్టి తీస్తే 20 కోట్లు వసూలు చేసింది. కేరళలో అది బాక్సాఫీస్ హిట్. కథేం లేదు… ఓ సాదా సీదా కెమెరామ్యాన్. ఎవ్వరితోనూ ఏ గొడవ పెట్టుకోడు. చాలా మంచివాడు. అమాయకుడు. అలాంటిది… ఓ రోజు చిన్నగొడవలో ఒకడు హీరోని కొడతాడు. అవమానిస్తాడు. అంతవరకు ఊళ్లో ఉన్న పరువు పోయిందని ఫీలవుతాడు. మళ్లీ వాడిని కొట్టేవరకు చెప్పులేసుకోనని ప్రతిజ్ఞ కూడా చేస్తాను. ఈ లోపే ప్రేమించిన అమ్మాయి ఇతని కన్నా మంచి సంబంధం వచ్చిందని వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఈ టైం బ్యాడ్‌లో మంచివాడైన మహేశ్వరానికి కోపం వస్తుంది. చివరికి హీరో చెప్పులేసుకున్నాడా లేదా అన్నదే కథ. కానీ ఈ ఇగో ఫ్యాక్టర్ చుట్టూ కథను నడిపిన విధానం, చుట్టూ ఉండే ప్రకృతి, ఫాజిల్ అద్భుతమైన నటన, వీటికి తోడు బిజిబాల్ మ్యూజిక్ మ్యాజిక్ చేశాయి. బిజిబాల్ కేరళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న వ్యక్తి. ఆ సినిమానే ఉమామహేశ్వర ఉగ్రరూపాయ పేరుతో సత్యదేవ్‌తో రీమేక్ చేశారు. కేరాఫ్ కంచరపాలెంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా సాధ్యమైనంత వరకు ఒరిజినల్ ఫ్లావర్‌తోనే వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజిబాల్ ఇచ్చిన సంగీతం, పాటలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అరకు లొకేషన్లతో కేరళ ఎఫెక్ట్ తీసుకురావాలని చూశారు. ఈ సినిమా మన రెగ్యులర్ ఆడియన్స్‌కి నచ్చుతుందో లేదో గానీ… హీరో సత్యదేవ్ మాత్రం దుమ్ము దులిపేశాడు. ఇంత వరకు సెకండ్ హీరో, హీరో ఫ్రెండ్, సైడ్ క్యారెక్టర్‌గానే నటిస్తూ పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఛాలెంజ్‌గా చేసి తనను తాను రుజువు చేసుకున్నాడు. ఒరిజినల్ ఆల్రెడీ చూసినవారికి ఫాజిల్ మాత్రమే గుర్తుంటాడు. ఆయనొక అద్భుత నటుడు. నేరుగా తెలుగు మూవీ చూసిన వారు సత్యదేవ్‌లో మంచి నటుడు కనిపిస్తాడు. ఇలాంటి సినిమా మొత్తాన్ని ఒకరే భుజాల మీద మోయడం అంత సులువు కాదు. ఈ సినిమాతో సత్యదేవ్ నటుడిగా ఏకంగా మూడు నాలుగు మెట్లు ఎక్కాడు. వైజాగ్ నుంచే వచ్చిన సత్యదేవ్ ఆ యాసని చాలా సులువుగా పలికాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నరేష్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ రూపా కొడువాయూర్ గురించి. క్లాసికల్ డ్యాన్సర్, తెలుగు అమ్మాయి రూప. ఈ సినిమాలో ఆమెలో మరో సాయి పల్లవి కనిపిస్తుంది. అసలు కొత్త నటి అన్న ఫీలింగ్ రాదు. క్లాసికల్ డాన్సర్ కావడం వల్ల హావభావాలు అదరగొట్టేసింది.మొత్తానికి పేరులో ఉగ్రరూపం ఉన్నా ఇది చాలా కూల్ మూవీ. ఫ్యామిలీ మొత్తంగా కూర్చుని హాయిగా చూసే సినిమాలు రావడమో ఈ రోజుల్లో అరుదు. ప్రకృతి వడిలో, పిల్లగాలుల్లో, అరకు అందాల మధ్య, సున్నితమైన ఈ కథ ఆకట్టుకుంటుంది.