June 7, 2023

వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. సుమారు 350 ఏళ్ల తర్వాత ప్రధాన ఆలయ అభివృద్ధి మోదీ హయాంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన వారణాసిలో జరిగిన చారిత్రక ఘటనను గుర్తుచేసుకుంటూ… వారన్ హేస్టింగ్‌ గురించి చెప్పారు. ఆ బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ కథేంటో మీకు తెలుసా? కాశీ ప్రజలు ఐకమత్యంతో వారన్‌ హేస్టింగ్‌ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టిన ఆ కథను తెలుసుకుందాం.

1773-1785 వరకు వారన్‌ హేస్టింగ్‌ బ్రిటీష్‌ ఇండియాకు గవర్నర్ జనరల్‌గా పనిచేశాడు. భారతీయ రాజుల మధ్య చిచ్చు పెట్టడం ఆ రాజ్యాలను దొంగదెబ్బ తీసి ఆక్రమించి, దోచుకోవడం.. ఇవీ పాలన పేరుతో ఆనాటి బ్రిటీష్‌ దొంగల ముఠా చేసిన పనులు. అలాంటి వారన్‌ హేస్టింగ్‌ని కాశీ ప్రజలు ఓ సారి తరిమి తరిమి కొట్టారు. ఆ దెబ్బకు వారన్ హేస్టింగ్‌కి బతికున్నంత కాలం కాశీ అంటేనే కాళ్లు వణికాయి.

Warren Hastings

అప్పటి కాశీరాజు బలవంత్‌ సింగ్‌కి ఇద్దరు రాణులు. వారిలో చిన్నరాణికి ఇద్దరు కొడుకులు. చేత్‌సింగ్‌, సుజన్‌ సింగ్‌. మొదటి రాణికి కొడుకులు లేరు. ఒక కూతురు పేరు పద్మా కన్వర్‌. బలవంత్‌ సింగ్‌ మరణించాక… కొడుకులు లేని మొదటి రాణి తన బంధువుల సహకారంతో సింహాసనం దక్కించుకునేందుకుఎత్తులు వేసింది. అలా మొదటి రాణి, రెండో రాణి మధ్య వారసుల గొడవ మొదలైంది. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు మధ్యలో దూరి ఆ రాజ్యం మీద పెత్తనం చేసేవారు బ్రిటీష్‌ వారు. తమ చెప్పుచేతల్లో ఉంటాడన్న కారణంతో బ్రిటీష్‌ వారు చేత్‌ సింగ్‌కి మద్దతు ఇచ్చారు. 1770 ఆగస్ట్‌లో చేత్‌ సింగ్‌ కాశీ సింహాసనం అధిష్టించాడు. అప్పట్లో అయోధ్య నవాబు షుజాహుద్దౌలా, కాశీ రాజులకు మధ్య శతృత్వం ఉండేది. కానీ చేత్‌ సింగ్‌ తెలివిగా అయోధ్య నవాబుతో రాజీ కుదుర్చుకుని స్నేహాన్ని ప్రకటించాడు. వారిద్దరూ బ్రిటీష్‌ని లెక్కచేయలేదు. అయోధ్యకు, కాశీకి యుద్ధం జరిగితే రెండు రాజ్యాలను ఆక్రమించాలనుకున్న బ్రిటీష్‌కి వీరిద్దరి స్నేహం నచ్చలేదు. ముఖ్యంగా కాశీ, అయోధ్య కలిసి ఈస్ట్‌ ఇండియా ముఠా మీద దాడి చేస్తే ఆ ప్రాంతంలో బ్రిటీష్‌ పెత్తనం తుడుచుపెట్టుకుపోతుంది. అందువల్ల చేత్‌సింగ్‌ రాజ్యాన్ని లాక్కొని… అతన్ని జమిందారుగా మాత్రం ఉంచాలని బ్రిటీష్‌ వారు కుట్రకు సిద్ధం చేశారు.

కాశీరాజుకి మరాఠాలకు మంచి స్నేహం ఉంది. బ్రిటీష్‌ కుట్రను తెలుసుకున్న చేత్‌ సింగ్‌… మరాఠా రాజుల సహాయం కోరాడు. ఈ లోపే బ్రిటీష్ వారు ఒక్కో రాజ్యంపై యుద్ధం చేస్తూ వచ్చారు. భారత్‌లో బ్రిటీష్‌ అక్రమించుకున్న రాజ్యాలకు గవర్నర్‌ జనరల్‌గా పనిచేస్తున్న వారన్‌ హేస్టింగ్‌ కాశీ రాజ్యంపై కన్నేశాడు. ఏడాదికి 5 లక్షల రూపాయల చొప్పున, మూడేళ్లు కప్పం చెల్లించాలని కాశీరాజు చేత్‌సింగ్‌కి సందేశం పంపాడు. గొడవలెందుకని మొదటి ఏడాది డబ్బు పంపించాడు. రెండో ఏడాది కప్పం కట్టలేదు. వారన్‌ హేస్టింగ్‌ మరో లక్ష జరిమానా వేసి 6 లక్షలు కట్టాలని, దాంతో పాటు వెయ్యి మంది సైనికులను తమ యుద్ధాలకు పంపించాలని బెదిరించాడు. బ్రిటీష్‌ బెదిరింపులను చేత్‌ సింగ్‌ పట్టించుకోలేదు. అప్పటికీ బ్రిటీష్‌ వారితో శాంతియుతంగానే ఉన్నాడు చేత్‌సింగ్‌. అయినా సరే వారన్ హేస్టింగ్‌ 1781 ఆగస్ట్‌ 15న తన సైనికులతో కాశీలో అడుగుపెట్టాడు. రాజుని బంధించి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని కాశీ రెసిడెంట్‌ కమాండర్‌ మార్కోమ్‌ని ఆదేశించాడు.

CHAIT SINGH GHAT

ఆగస్ట్‌ 17న చేత్‌సింగ్‌ కాశీ విశ్వనాథుని పూజ కోసం కాశీలో తన శివాల ప్యాలెస్‌కి వచ్చాడు. ఇప్పుడా ప్యాలెస్‌ ఉన్న ప్రాంతమే చేత్‌సింగ్‌ ఘాట్‌. పూజ చేసుకునే ప్రాంతానికి ఈస్ట్‌ ఇండియా దూత వచ్చి… చేత్‌సింగ్‌ని బెదిరించాడు. చేత్‌సింగ్‌ సహచరుడు నాన్కుసింగ్‌కి ఆ దూత అన్న మాటలకు కోపం వచ్చింది. అక్కడికక్కడే ఈస్టిండియా దూత తల నరికేశాడు. విషయం తెలిసిన వారన్‌ హేస్టింగ్స్‌ మండిపడ్డాడు. రెండు కంపెనీల సైన్యాన్ని పంపించి.. చేత్‌సింగ్‌ని ఈడ్చుకు రమ్మన్నాడు. పూజ కోసం వచ్చిన చేత్‌ సింగ్ చుట్టూ కొద్ది మందే సైన్యం ఉన్నారు. అప్పుడు కాశీ ప్రజలు తమ రాజును కాపాడుకున్నారు. బ్రిటీష్‌ వాళ్లు చేత్‌ సింగ్‌పై దాడి చేస్తున్నారని తెలియగానే కాశీలో పడవలు నడిపేవారు, స్థానికులు ఏకమయ్యారు. వారికి కాశీ సైనికులు తోడుగా నిలిచారు. వారంతా కలిసి 200 మంది బ్రిటీష్‌ సైనికులను చంపేశారు. బ్రిటీష్‌ రెసిడెంట్‌ మార్కోమ్‌ ఇంటిపై కాశీ ప్రజలు దాడి చేశారు. బ్రిటీష్‌ సైనికులంతా చనిపోయారని తెలిసిన వారన్ హేస్టింగ్‌ వణికిపోయాడు. కాశీ శివారుల్లో దొంగలా దాక్కున్నాడు. పారిపోతే ప్రాణాలైనా మిగులుతాయని అతని సహచరులు చెప్పారు. బయటకనిపిస్తే ఆ రోజే వారన్‌ హేస్టింగ్‌కి కాశీ ప్రజలు పిండం పెట్టేసేవారు. అందుకే బ్రిటీష్‌ సైనికులు వారన్ హేస్టింగ్‌కి చీర కట్టి.. ఆడవేషంలో తయారు చేసి… పల్లకీ ఎక్కించి దొంగతనంగా కాశీ దాటించారు. అలా కాశీ ప్రజలు శక్తివంతమైన బ్రిటీష్‌ ఇండియా అధినేతను తరిమి తరిమి కొట్టారు. ఆ రోజు నుంచి కాశీ అంటేనే వారన్‌ హేస్టింగ్‌ కాళ్లు వణికేవి. ఇప్పటికీ కాశీలో వారన్‌ హేస్టింగ్‌ మీద ఓ సామెత ఉంది. ఘోడే పర్‌ హౌదా.. హాథి పర్‌ జిన్‌.. ఐసే భాగే వారన్‌ హేస్టింగ్‌… అని స్థానికులు చెప్తుంటారు. అంటే అర్థం గుర్రం మీద వేయాల్సిన జిన్‌ ఏనుగు మీద, ఏనుగు మీద వేయాల్సిన హౌద గుర్రం మీద వేశాడని. ఏం చేస్తున్నాడో అతనికే తెలియనంత హడావిడిగా కాశీ నుంచి వారన్‌ హేస్టింగ్‌ పారిపోయాడు. అలా బ్రిటీష్‌ గవర్నర్‌ జెనరల్‌ కాశీలో ఓ కామెడీ క్యారెక్టర్‌లా మిగిలిపోయాడు. ఇలాంటి వీరగాధలెన్నో కాశీలో ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న కాశీ అస్తిత్వం, అక్కడి ఆధ్యాత్మిక శక్తి అంత గొప్పవి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *