విజయ్ దేవరకొండ. అప్పుడెప్పుడో వచ్చిన రవిబాబు సినిమా నువ్విలాలో ఒక చిన్న క్యారెక్టర్. అసలు గుర్తుండే క్యారెక్టరే కాదు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్ర. ఆ తర్వాత మూడేళ్లు కనిపించలేదు. నానీ హీరోగా చేసిన ఎవడే సుబ్రమణ్యంలో.. అరెరె.. ఈ కుర్రాడెవరు భలే నటిస్తున్నాడే.. అనుకున్నారు. పెళ్లి చూపులు సినిమా వరకు విజయ్ దేవరకొండ ఎవరో తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలీదు. పెళ్లి చూపులు సినిమాలో తన మేనరిజమ్స్ చాలా ఫ్రెష్‌గా, ఇప్పటి యూత్‌కి చాలా కనెక్టింగ్‌గా ఉన్నాయి. అలా అతను ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యాక తర్వాత సినిమా ద్వారక ఫ్లాప్. అయితే… టాలెంట్ ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు. అల్లూ అర్జున్ రిజెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి కథకి విజయ్ అయితే సరిపోతాడని… సందీప్ వంగాకి ఎందుకనిపించిందో తెలీదు గానీ.. ఆ సినిమా బ్లాక్ బస్టర్. అర్జున్ రెడ్డిలో నటనకు విజయ్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. మాస్ ఇమేజ్ సంపాదించుకోడానికి నానా తంటాలు పడుతుంటారు హీరోలు. అలాంటిది తనకే స్పెషల్ అనిపించే మ్యానరిజమ్స్‌తో విజయ్ చాలా ఈజీగా మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అలాగని ఆ చట్రంలో ఇరుక్కుపోయి.. భారీ ఫైట్లు, భారీ డైలాగుల బాపతు కాదు. అందుకే మహానటి సినిమాలో ఆంటోనీ పాత్రకు వెంటనే ఒప్పుకున్నాడు. ఆ సినిమాలో విజయ్ కనిపించగానే థియేటర్లో ఈలలు పడ్డాయి. ఇదొక్కటి చాలదూ స్టార్ అనిపించుకోడానికి.
ఇవన్నీ ఒకెత్తు… గీత గోవిందం మరొకెత్తు. ఇక్కడ కూడా విజయ్‌ది ట్రెండ్ సెట్టింగ్ అనే చెప్పాలి. ఒక సున్నితమైన కథతో తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. విజయ్, రష్మికల మెప్పించే నటన, పరశురాం సెన్సిబుల్ డైరెక్షన్‌తో ఈ సినిమా భారీ చిత్రాల స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 8 రోజులకే గీతగోవిందం కలెక్షన్లు 70 కోట్లు క్రాస్ చేసిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లు సాధించి… పెద్ద హీరోలతో సమానంగా వసూలు చేసిన ఈ సినిమాతో విజయ్ స్టార్ అయిపోయాడు. నిర్మాతలకు ప్రామిసింగ్ హీరోగా మారాడు. ఈ సక్సెస్ మీట్‌కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు.. విజయాన్ని తలకెక్కించుకోకుండా, మనసుకి ఎక్కించుకుంటే… విజయ్ మరో సూపర్ స్టార్. ఇది ఆయన టాలెంట్‌కి, కష్టానికి దక్కిన ఫలితం. నిజానికి చాలా క్యాజ్‌వల్‌గా ఉండే విజయ్… ఉన్నది ఉన్నట్టు మాటాడేస్తాడు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్.
ఎక్కడో చూసిన పరిచయంలా కనిపించే విజయ్ ఫేస్ లుక్, క్యాజువల్ డైలాగ్ డెలివరీ, హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తూనే… రఫ్ లుక్.. ఇవన్నీ సూపర్ స్టార్ క్వాలిఫికేషన్స్. విజయ్ తర్వాత సినిమాల మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో ఏ రెండు సూపర్ హిట‌్ తెచ్చుకున్నా.. ఇప్పుడున్న కుర్రహీరోలందరికీ విజయ్ చాలా టఫ్ కాంపిటేషన్. బహుశా.. వాళ్లందరినీ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.