May 30, 2023

ముందున్నది.. కోహ్లీ సేనకు అసలు ‘టెస్ట్‌’

ముందున్నది.. కోహ్లీ సేనకు అసలు ‘టెస్ట్‌’

అంతేగెలిస్తే ఆకాశానికెత్తేస్తారు.. ఓడితే అమాంతం కిందపడేస్తారు. ఏ ఆటలోనైనా అంతే. క్రికెట్‌లో ఇది కాస్త ఎక్కువ. ఇంగ్లండ్‌ టూర్‌లో కోహ్లీ సేనవి కేవలం ఓటములే కావు. లోపాలతో కూడిన వైఫల్యాలతో కూడిన ఓటములు. అందుకే విమర్శల వేడి కాస్త ఎక్కువగా ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఓడినా పోన్లే అనుకున్నారు. కానీ, లార్డ్స్‌ మనకు ప్రతిష్ఠాత్మకం. అక్కడ ఓడితే సగటు క్రికెట్‌ అభిమాని జీర్ణించుకోలేడు. కపిల్‌, ధోనీకి సాధ్యమైన ఫీట్‌ కోహ్లీకి ఎందుకు సాధ్యం కావడం లేదు? అంటే సవాలక్ష కారణాలు కనిపిస్తున్నాయి. “ అవును మేం చెత్తగా ఆడాం.. అందుకే ఓడాంఅని కోహ్లీ నిజాయితీగా ఒప్పుకున్నా ఈ ఓటముల వెనుక నాయకత్వ లోపాలు కూడా స్పష్టంగా కనిపించాయి. లార్డ్స్‌లో కోహ్లీ కూడా అతి సాధారణ ఆటగాడిగా మారాడు. కనీస ప్రతిఘటన కూడా కనిపించలేదు. పూర్తిగా చేతులెత్తేయడం టీం ఇండియా లాంటి జట్టు నుంచి ఊహించలేం. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా తమ వంతు ఓటమికి కృషి చేశారు. కనీసం రెండున్నర రోజులు పూర్తి కాక ముందే చాపచుట్టేయడం.. అస్సలు ఆహ్వానించలేం. ఈ విమర్శల జోరులోనే బీసీసీఐ కూడా సీరియస్‌గా ఉంది. సొంత గడ్డపై పులుల్లా విజృంభించే మనవాళ్లువిదేశీ పిచ్‌ల పిల్లులైపోతారని ఎంతో కాలం నుంచి వస్తున్న విమర్శ. ధోనీ వచ్చాక ఆ పరిస్థితి మారింది. కోహ్లీ వచ్చాక ఇంకా మారాలి. కానీ మళ్లీ కోహ్లీ ఈ ఆటతీరులో మళ్లీ ధోనీ ముందరి కాలానికి తీసుకెళ్లాడన్న విమర్శలూ వస్తున్నాయి. ఎప్పుడూ గెలుపే సాధ్యం కాదు.. కానీ ఓటమి కూడా గౌరవంగా ఉండాలి. లార్డ్స్‌లో భారత్‌ గౌరవంగా ఓడిపోలేదు. పరాభవం మూటగట్టుకుంది. ఓటమికి, పరాభవంకి చాలా తేడా ఉంది. రవి శాస్త్రి కోచ్‌గా ఉన్న విదేశీ సిరీస్‌లు ఎందుకో గెలవలేకపోయాం. 2014 ఆస్ట్రేలియా టూర్‌లోనూ ఇంతే. ఈ ఏడాది సౌక్‌ఆఫ్రీకా సిరీస్‌ కూడా సమర్పణం. ఇప్పుడు ఇంగ్లండ్‌. ప్రాబ్లెం ఎక్కడుందో మరి. అసలు టీంని సెట్‌ చెయ్యడంలో కూడా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ఆడే విధానంలోనూ ఆశ్చర్యకరమైన లోపాలు. స్వింగ్‌ అవుతున్న బంతిని లైన్లో ఆడకూడదన్న విషయం తెలియకపోతే ఎలా అంటున్నారు సీనియర్‌ ఆటగాళ్లు. ఇండియన్స్‌ బలం స్ట్రోక్‌ ప్లే.. ఈ టెస్ట్‌ల్లో స్ట్రోక్‌ ప్లేను వదిలేసి ఆత్మరక్షణలో పడ్డారు మన ప్లేయర్లు. ఇవి.. ఇంగ్లండ్‌కి కలిసొస్తున్నాయి. ఇంత అనుభవం ఉండీ కూడా ఇలాంటి పొరపాట్లు భారీ మూల్యాన్ని చెల్లించాయి. మూడో టెస్ట్‌.. నిజంగా కోహ్లీ సేనకు టెస్టే. ఈ పరీక్ష పాసైతే ఓకే. లేదంటేవిమర్శల జడివాన తప్పేట్టు లేదు. ఆల్‌ ద బెస్ట్‌ కోహ్లీ.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *