June 7, 2023

యువశక్తిని నిద్రలేపిన గొప్ప వ్యక్తి, శక్తి వివేకానందుడు. అందుకే ఆయన ప్రతీ ఏటా ఆయన జయంతి రోజైన జనవరి 12న యువజన దినోత్సవంగా దేశం జరుపుకుంటుంది. ఈనాడు హిందూ ధర్మానికి ప్రపంచం సలాం కొడుతోందంటే అందుకు కారణం వివేకానందుడే. మన ధర్మం, మన సంప్రదాయమే భారతీయతకు మనుగడ అని చెప్పిన ధార్మికుడు, మహర్షి ఆనందుడు. దేశంలో ధర్మం గతి తప్పినప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుల్లో ఆధునికుడు వివేకానందుడు. 1863 సంవత్సరం, జనవరి 12న కలకత్తా నగరంలో విశ్వనాథ్‌ దత్త, భువనేశ్వరీ దేవి దంపతులకు జన్మించాడు వివేకానందుడు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు నరేంద్రనాథ్‌ దత్త. ముద్దుగా నరేన్‌ అని పిలిచేవారు. నరేంద్రది ఒక పెద్ద న్యాయవాదుల కుటుంబం. కానీ నరేంద్రుడు విభిన్నంగా ఆలోచించేవాడు. నరేంద్రుని తాతగారు దుర్గా చరణ్‌ దత్తా. పర్షియన్‌, సంస్కృత భాషల్లో ఆయన దిట్ట. కానీ ఆయన పాతికేళ్లకే సన్యసించారు. ఆ వారసత్వమే నరేంద్రుడికీ వచ్చింది. కాశీ విశ్వనాథుడి వరప్రసాదంగా నరేంద్రుడు పుట్టాడని అతని తల్లిదండ్రులు అనుకునేవారు. చిన్నతనంలో నరేంద్రుడు చాలా అల్లరి చేసేవాడు. మరో వైపు ఆధ్యాత్మిక విషయాలవైపు ఆలోచించేవాడు. రాముడు, సీత, శివుడు వీరంతా అతనికి స్నేహితుల్లా అనిపించేవారు. ముఖ్యంగా తన తల్లి రోజూ చెప్పే రామాయణ, భారత కథలు నరేంద్రుని మనసులో నిలిచిపోయాయి. అంత గొప్ప చరిత్ర ఉన్న భారత దేశం బ్రిటీష్‌ వారి పాలనలో కళా విహీనంగా మారిపోయిందని బాధపడేవాడు. మన ధర్మం పట్ల ప్రజలకు అవగాహన వస్తే మళ్లీ దేశం కళకళలాడుతుందని, ధర్మమే రక్షిస్తుందని నరేంద్రుడు అనుకునేవాడు.ఆ ఆలోచనలతోనే కనిపించిన ప్రతీ సన్యాసితో మాట్లాడేవాడు. వారు తెలుసుకున్న కొత్త విషయాలను అడిగేవాడు. నరేంద్రుడికి ధైర్యం ఎక్కువ. దేనికీ భయపడేవాడు కాదు. ఏకసంధాగ్రాహి.. ఒక్కసారి ఏదైనా చెప్తే వెంటనే అప్పచెప్పేసేవాడు. అంతటి తెలివైన పిల్లాడిలో… సన్యాసం లక్షణాలు తల్లిదండ్రులను కలవరపెట్టేవి.

నరేంద్ర చాలా అందగాడు. చూడగానే ఆకట్టుకునే రూపం. ఆకట్టుకునే మాట. విద్యలోనే కాదు తత్వశాస్త్రంలోనూ టాపర్‌గా నిలిచాడు. సంగీతంలోనూ బాగా ప్రవేశం ఉంది. కాలేజీలో నేర్పే విదేశీ చదువుని మొత్తం చదివేశాడు. ముఖ్యంగా ప్లేటో, సోక్రటీస్‌ లాంటి గ్రీకు తత్వాన్ని చదివి పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఇంత చదివాక నరేంద్రుడికి ఒక్కటే అర్థమైంది. భారతీయ వేద విజ్ఞానాన్ని మించిన చదువు మరొకటి లేదని. హిందూ ధర్మాన్ని మించిన ధర్మం ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని. అప్పుడే నరేంద్రుడిని మనసులో మెదిలిన ప్రశ్న. దేవుడు ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు నరేంద్రుడు చాలా చోట్ల తిరిగాడు. విగ్రహారాధనను వ్యతిరేకించే బ్రహ్మ సమాజంలోనూ కొన్నాళ్లు ఉన్నాడు. అవేవీ నరేంద్రుడికి సంతృప్తినివ్వలేదు. కానీ నరేంద్రుడి అన్వేషణ ఆగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో … కలకత్తాకు కొద్ది దూరంలో ఉన్న దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని.. అతని దగ్గరకు వెళ్లమని నరేంద్రుని గురువు విలియం హేస్టీ సలహా ఇచ్చాడు. ఆ సాధువే… మహర్షి రామకృష్ణ పరమహంస. ఆయన్ను కలవడమే నరేంద్రుని జీవితంలో అతి పెద్ద మలుపు. అలా 1881లో అంటే సరిగ్గా 18 ఏళ్ల యవ్వన వయసులో… దేవుడిని వెతుక్కుటూ… రామకృష్ణ పరమ హంస దగ్గరకు వెళ్లాడు నరేంద్రుడు. పరమహంసను కలవగానే నరేంద్రుడు అడిగిన మొదటి ప్రశ్న… అయ్యా మీరు దేవుడిని చూశారా… అందుకు రామకృష్ణుల వారు చెప్పిన సమాధానం..చూశాను… ఇప్పుడు నిన్ను చూస్తున్నదాని కన్నా స్పష్టంగా చూశాను అని సమాధానం చెప్పారు. అలా దైవదర్శనం అయిన రామకృష్ణ పరమహంసకు శిష్యుడిగా మారారు నరేంద్ర.

శిష్యుడిగా చేరిపోతాను అనగానే రామకృష్ణులు చేర్చేసుకోలేదు. చాలా పరీక్షలు పెట్టారు. ఇటు రామకృష్ణ పరమహంస పొందిన ఆధ్యాత్మిక స్థితిలో నిజం ఎంతో తెలుసుకునేందుకు నరేంద్రుడు కూడా పరీక్షించారు. 1884లో నరేంద్రుని తండ్రి స్వర్గస్తులయ్యారు. కుటుంబంలో ఏర్పడిన కష్టాలను గట్టెక్కించాక… నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు పూర్తి స్థాయి శిష్యుడిగా మారారు. అప్పటి వరకు నరేంద్రుడిలో అంతో కొంతో సంప్రదాయ వ్యతిరేకధోరణులు ఉండేవి. వాటన్నిటినీ రామకృష్ణ పరమహంస తొలగించారు. తపస్సు ఎలా చేయాలో బోధించారు. తమ శిష్యులందరినీ అధిగమించాడు నరేంద్రుడు. రామకృష్ణ పరమహంస సమాధి స్థితికి వెళ్లడానికి 3 రోజుల ముందు… తన ఆధ్యాత్మిక శక్తినంతా నరేంద్రుడికి ధారపోశారు పరమహంస. ఈ శక్తితో ధర్మాన్ని రక్షించి, అద్భుతాలు సృష్టించు అని రామకృష్ణులు వివేకానందుడికి బోధించారు. 1886లో రామకృష్ణ పరమ హంస సమాధి స్థితికి వెళ్లారు. ఆ తర్వాత రామకృష్ణుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని నరేంద్రులు తీసుకున్నారు. అప్పటి నుంచే ఆయన పేరు వివేకానందుడిగా మారింది. శిష్యులతో హిందూ ధర్మాన్ని రక్షించే పనిలో పడ్డారు. అందరూ సన్యాసం పుచ్చుకున్నారు. వివేకానందుడి సన్యాసం స్వీకరించిన స్థలం బారానగర్‌. 1888 నుంచి వివేకానందుడు దేశాటనకు బయలు దేరారు. రెండేళ్ల పాటు ఆనందుడు ఓ సన్యాసిలా, బైరాగిలా గడిపారు. దేశంలో పరిస్థితులను అర్థం చేసుకున్నారు. అన్ని రకాలుగా జ్ఞానోదయం పొందారు. ఆయన దృక్పథంలో మార్పు వచ్చింది.

ధర్మం నిలబడితే దేశం నిలబడుతుందని అనుకున్నారు. అందుకు యువతే ప్రధాన ఆయుధమని గ్రహించారు. యువత ఆలోచనల్లో మార్పు వస్తే భారత దేశం ప్రపంచ దేశాలన్నిటిలో అగ్రగామిగా నిలుస్తుందని ఆనాడే ఆలోచించిన మహర్షి వివేకానందుడు. సన్యాసం అంటే ఏకాకిలా మిగిలిపోవడం కాదని, ప్రజలకు వారి బాధ్యతలను గుర్తుచేయడం అని… ఆధునికంగా ఆలోచించారు. వారణాసి నుంచి దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు. దేశాన్ని, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా మార్చగలిగితే… శాంతి ఖచ్చితంగా వస్తుందని భావించారు. ఒక్కొక్కరూ ఒక్కో దారిలో స్వతంత్ర పోరాటం చేశారు. గాంధీజీ అహింసా మార్గంలో, భగత్‌ సింగ్‌ విప్లవ మార్గంలో.. అలాగే వివేకానందుడి స్వతంత్ర పోరాటం ఆధ్యాత్మిక మార్గంలో నడిచింది. ప్రజలు, పాలకులు ఎవరైనా దేవుడిని నమ్ముతారు. వారిలో ఆ ఆధ్యాత్మిక భావనలను, సంప్రదాయాలను రగిలిస్తే శాంతిగా ఆలోచిస్తారని వివేకానందుడు భావించారు. ఎన్నో రాజ్యాలు తిరిగారు. దేశమంతా పర్యటించారు. స్వతంత్ర పోరాట యోధులను కలిశారు. అన్ని చోట్ల ధర్మం ఎంత గొప్పదో ఉపదేశాలు చేశారు. ఎంతో మంది ఆనందుడి భక్తులయ్యారు. మూడేళ్లపాటు ఎక్కువగా కాలినడకనే దేశమంతా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. అలా దేశమంతా తిరిగిన ఆనందుడిని ఆకర్షించిన ప్రాంతం కన్యా కుమారి. అద్భుతమైన సూర్యోదయాన్ని ఆస్వాదించారు స్వామీజి. సముద్రానికి కొద్ది దూరంలో ఉన్న రాయి దగ్గరికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ ధ్యానం చేశారు. భారత దేశ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతమే వివేకానందా రాక్‌గా ప్రసిద్ధి చెందింది. సరిగ్గా అప్పుడే అమెరికాలోని షికాగోలో సర్వ మత మహా సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విరాళాలు సేకరించి ఆ సభకు వెళ్లేందుకు ఆనందుడు సిద్ధమయ్యాడు. ఆ సభ వల్లే హిందూ ధర్మ గొప్పదనం ప్రపంచ దేశాలకు తెలిసింది. అందుకు కారణం వివేకానందుడు. దీని వెనుక పెద్ద కథే ఉంది. 1893 మే 31న వివేకానందుడు అమెరికాకుక బయలుదేరారు. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్లు మాత్రమే. సెప్టెంబరులో సర్వ మత మహా సభ. అయితే ఆ సభలో పాల్గొనాలంటే ఎవరైనా రిఫెరెన్స్‌ ఇవ్వాలి. అక్కడ ఆనందుడికి తెలిసినవారు ఎవరూ లేరు. కానీ ఒక గొప్ర ప్రయత్నానికి ప్రకృతి సహకరిస్తుంది. షికాగోలో ఖర్చు ఎక్కువని ఆనందుడు బోస్టన్‌ బయలు దేరారు. ఆ ప్రయాణంలోనే ఆయనకు మిస్‌ కాథరీన్‌తో పరిచయం అయింది. ఆమె స్వామిజీకి ఆతిథ్యం ఇచ్చింది. ఆమె ద్వారానే స్వామీజికి… హార్వార్డ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జాన్‌ హెన్రీ రైట్‌తో పరిచయం అయింది.ఆయనే సర్వ మత సభలో పాల్గొనేందుకు వివేకానందుడికి రిఫరెన్స్ లెటర్ ఇచ్చారు. మహా సభకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. స్వామీజీ షికాగో వచ్చారు. కానీ ఆతిథ్యం ఇచ్చేవారి అడ్రస్‌ పోగొట్టుకున్నారు. దిక్కుతోచక రోడ్డు పక్కనే పడుకుంటే… దేవతలా వచ్చింది జార్జ్‌ W హేల్‌. ఆమె స్వామిజీకి ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఇల్లే అమెరికాలో స్వామిజీ చిరునామా అయింది. ఆ ఇంటి వారంతా వివేకానందుడి భక్తులయ్యారు.

భారత దేశ చరిత్రలో గొప్ప రోజుల్లో ఒకటి 1893 సెప్టెంబర్‌ 11. షికాగోలో సర్వ మత మహా సభ ప్రారంభమైంది. ఆ సభకు 7 వేల మంది హాజరయ్యారు. ప్రపంచం నలుమూలల నుంచి అన్ని మతాల వారు వచ్చారు. అంత పెద్ద సభలో ఆనందుడు ఎప్పుడూ ప్రసంగించలేదు. ఆయనకు ఐదు నిమిషాలు సమయం ఇచ్చారు. వివేకానందుడు సరస్వతీ దేవికి, తన ఇష్టదైవం కాళీకి నమస్కరించి… సోదర సోదరీమణులారా అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. అంతవరకు అందరినీ తోడబుట్టిన వారిగా చేసిన సంబోధనకు… అక్కడ ఉన్నవారందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యారు. ఎంతోసేపు ఆ ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. ఇక వివేకానందుడి వాక్‌ ప్రవాహం ఐదు నిమిషాలు కాదు అరగంట దాటినా అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఆయన ముఖ వర్చస్సు, కాషాయ వస్త్రాలు.. అసలైన భారతీయతకు నిలువెత్తు రూపం ఆనాడు షికాగో సభలో అందరికీ కనిపించింది. ఆ సభలో పాల్గొన్న అందరిలో ది బెస్ట్‌గా ఆనాటి పత్రికలు వివేకానందుడిని పొగడ్తల్లో ముంచెత్తాయి. ఆ మహాసభతో ఆనందుడి కీర్తి ప్రపంచమంతా తెలిసింది. అలా 1896 వరకు విదేశాల్లో హిందూ ధర్మ ప్రచారాన్ని చేశారు స్వామీజి. ఆయనకు ఎంతో మంది శిష్యులయ్యారు. అన్ని మతాలకు వేదాంతం, తత్వమే మూలమని వివేకానందుడు గుర్తించారు. ఆ వేదాంతాన్ని తెలుసుకుంటే… మనుషుల మధ్య బేధ భావం పోయి… సమభావం ఏర్పడుతుంది ప్రచారం చేశారు. వేదాంతాన్ని అందరికి అర్థమయ్యే భాషలో వివరించారు.

1896లో ఆయన లండన్‌ నుంచి భారత్‌కి బయలు దేరారు. భారత్‌కి వస్తూనే ఆయన ఇచ్చిన సందేశం… ఓ నా భారత దేశమా…. నీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలుసా… మరణం లేని నీ ఆత్మలోనే… అన్నారు. బలహీనతలను, పిచ్చి నమ్మకాలను వదిలి… హైందవ ధర్మంలో ఉన్న ధైర్యాన్ని అందుకోమని యువత నిద్ర వదిల్చారు. ఎందుకూ పనికిరాని ఆ విదేశీ పద్ధతులు వదిలి, కుల విబేధాలను వదిలి, పిచ్చి పిచ్చి నమ్మకాలను వదిలి… ఆధునిక ఆలోచలనతో అడుగులు వెయ్యమన్నారు. ఎంతో మంది యువతను మెరికల్లా తయారు చేశారు. దేశమంతా తిరిగి చైతన్యం నింపారు. యువతను చైతన్య పరిచేందుకు ఓ వేదిక ఉండాలనుకున్నారు. అలా 1897లో రామకృష్ణ మిషన్‌ని ఏర్పాటు చేశారు వివేకానంద. రామకృష్ణ మిషన్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. రామకృష్ణ పరమహంస తర్వాత… జగన్మాతను ప్రత్యక్షంగా చూసిన అనుభవం వివేకానందకే కలిగిందని అంటారు. ఆ ప్రత్యక్ష అనుభవాన్ని వివేకానందులు తన జ్ఞాపకాల్లో రాసుకున్నారు. 1898లోనే వివేకానందుడి ఆరోగ్యం క్షీణించింది. అక్టోబర్‌ నాటికి చాలా బలహీనమయ్యారు. స్వస్థలం కలకత్తాకు చేరుకున్నారు. కలకత్తా నుంచి ఐదు మైళ్ల దూరంలో బేలూరు అనే ప్రాంతం ఉంది. 1899లో అక్కడ మఠం ప్రారంభించారు. ప్రఖ్యాతి చెందిన బేలూరు రామకృష్ణ మఠం అదే. బెంగాలి మాసపత్రిక ఉద్భోధన్‌ ద్వారా తన ఉత్తేజకరమైన ప్రసంగాలను యువతకు చేర్చారు. అనారోగ్యంలోనూ చాలా దేశాలు పర్యటించీ అక్కడా మఠాలు ఏ‌ర్పాటు చేశారు. 1900 డిసెంబర్‌ 9న మళ్లీ కలకత్తాలోని బేలూరు మఠానికి చేరుకున్నారు వివేకానంద. 1902 జులై 4 స్వామి వివేకానంద ధ్యాన ముద్రలో ఉండగానే మహా సమాధిలోకి వెళ్లిపోయారు. భౌతికంగా మన మధ్య ఆయన లేరు. అయినా ఉత్సాహం, ఉత్తేజం నింపే ఆయన మాటలు, యువతలో చైతన్యాన్ని నింపి బాధ్యతను గుర్తు చేసే ఆనందుని మార్గదర్శనాలు ఇప్పటికీ, ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. భారత దేశ స్వతంత్ర పోరాటంలో ముఖ్యంగా యువతలో నమ్మకం నింపి.. వారిలో ఉన్న శక్తిని వారికి గుర్తు చేసిన మహర్షి వివేకానందుడు. ఆనాడు మహా భారత యుద్ధంలో గాండీవం వదిలేసిన అర్జునుడిలో చైతన్యం నింపిన కృష్ణ గీత భగవద్గీత అయితే… ఈనాటికీ యువతలో చైతన్యం నింపుతున్న ఆధునిక భగవద్గీత… ఆనందుని మాటే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *