June 3, 2023

టేబుల్‌ టాప్‌ రన్‌ వే. కేరళలో కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదం తర్వాత టేబుల్‌ టాప్‌ రన్‌ వే పేరు బాగా వినిపిస్తోంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అంటే 2010లో మంగళూరులో కూడా ఇలాంటి టేబుల్ టాప్ రన్ వే మీద విమానం లోయలో పడి ప్రమాదం జరిగింది. అప్పుడు 158 మంది మరణించారు. భారత ఏవియేషన్‌ ప్రమాదాల్లో ఘోర దుర్ఘటనగా ఇది మిగిలింది. ఇప్పుడు మళ్లీ అలాంటి టేబుల్‌ టాప్‌ మీద జరిగిన ప్రమాదం.. మరోసారి భయపెట్టింది.

ఇంతకీ ఏమిటీ టేబుల్‌ టాప్‌ రన్‌ వే?


కోజికోడ్‌ టేబుల్‌ టాప్‌ రన్‌ వే

ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన రన్‌వేలను టేబుల్‌ టాప్‌ రన్‌వేలు అంటారు. ఈ రన్‌వేలు పొడవైన టేబుల్‌లా కనిపిస్తాయి. టేబుల్‌ మీద ఉన్న వస్తువు అదుపు తప్పితే ఎలా పడిపోతుందో తెలుసుగా. సరిగ్గా అలాగే ఈ రన్‌వే మీద కూడా ఆ లిమిట్‌ దాటితే విమానం కూడా పడిపోతుంది. ఇలాంటి రన్‌వేల చివర సాధారణంగా చిన్నపాటి లోయలు గానీ, కొండలు గాని ఉంటాయి. రెండూ డేంజరే. అన్ని చోట్లా సమతలంగా విమానాశ్రయాలుంటాయి. మరి ప్రమాదం అని తెలిసినా ఈ టేబుల్‌ టాపులెందుకు? ఎక్కువగా పర్వతాలు, పీఠభూమి ప్రాంతాల్లో ఈ టేబుల్‌ టాపులు నిర్మిస్తారు. ఇవి మనం రెగ్యులర్‌గా చూసే రన్‌వేల కన్నా చాలా చిన్నగా ఉంటాయి. ఎంత గొప్ప పైలట్లైనా ఈ రన్‌వేల మీద కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. అలాంటిదే కోజికోడ్‌ ప్రమాదం కూడా.మన దేశంలో మూడు టేబుల్ టాప్ రన్ వేలు మూడు ఉన్నాయి. ఒకటి కర్నాటకలోని మంగళూరు, రెండోది కేరళలోని కోజికోడ్‌, మూడోది మిజోరాం లెంగ్‌ప్యూ విమానాశ్రయం. లోయలు, కొండలు ఉన్న ప్రదేశాల్లో ఎయిర్‌పోర్ట్‌ నిర్మించాలంటే ఈ టేబుల్‌ టాపులు తప్పవు. వీటి మీద టేకాఫ్‌ కష్టమే, ల్యాండింగూ కష్టమే. అత్యంత నైపుణ్యం ఉన్న పైలట్లు మాత్రమే ఈ టేబుల్ టాప్ రన్‌వేల మీద సురక్షితంగా ల్యాండింగ్, టేకాఫ్ చేయగలరు. రెగ్యులర్‌ రన్ వే మీద విమానం జారిపోతే పక్కకు ఒరిగిపోతుంది. ప్రమాద తీవ్రత కాస్త తక్కువ. అదే టేబుల్ టాప్ మీద చిన్న ప్రమాదం జరిగినా తీవ్రత చాలా ఎక్కువ. అందుకు ఉదాహరణ కోళికోడ్ విమాన ప్రమాదం. ఇక్కడ విమానం ఏకంగా రెండు ముక్కలైపోయింది.

టేబుల్‌టాప్‌ విమానాశ్రయాల్లో అన్ని విమానాలు దిగలేవు. షార్ట్‌ ఫీల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌ టెక్నాలజీ ఉన్న విమానాలే టేబుల్‌ టాప్‌కి అనుకూలం. పైలట్‌ కూడా ఈ రన్‌వేకు తగ్గట్టు విమానాన్ని దించాల్సి ఉంటుంది. ఇంత టెన్షన్‌ ఉంటుంది కనుకేచాలా విమానయాన సంస్థలు బోయింగ్‌ 737, ఎయిర్‌బర్‌ ఏ330 వంటి విమానాలను టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్న విమానాశ్రయాలను వద్దనుకున్నాయి. పదేళ్ల క్రితం మంగళూరులో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడేఈ టేబుల్‌ టాపులు వద్దనుకున్నారు. కానీ ఆ హెచ్చరికను ఎవరూ పట్టించుకోలేదు. అందులోనూ కోజికోడ్‌ రన్‌వే మరీ డౌన్‌ స్లోప్. సాధారణంగా ఎయిర్‌ పోర్ట్‌ రన్‌వే చివర 240 మీటర్ల బఫర్‌‌ జోన్‌ ఉండాలి. కానీ కోజికోడ్‌ టేబుల్‌ టాప్‌కి 90 మీటర్లు మాత్రమే ఉంది. రన్‌వే సైడ్‌లో 100 మీటర్ల స్పేస్‌ కచ్చితంగా ఉండాలి. కోజికోడ్‌లో 75 మీటర్లే ఉంది. అందుకే 190 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి లాండింగ్ సమయంలో ఘోరం జరిగింది.

కోజికోడ్‌ ఎయిర్‌పోర్టు పెద్ద విమానాలకు అనువైనది కాదు. కానీ, ఏటా ఇక్కడ నుంచి హజ్ యాత్రకు పెద్ద విమానాలు వెళ్తుంటాయి. ఎన్నోసార్లు నిపుణులు హెచ్చరికలు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదన్న మాటే వినిపిస్తోంది. ఇక్కడ తప్పులు వెదకాల్సి వస్తే.. టేబుల్‌ టాప్‌ ఎయిర్‌ పోర్ట్‌ వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయి. విమాన ప్రయాణంలో చిన్న తప్పు జరిగితే.. అది వందల ప్రాణాలకు ప్రమాదం. అలాంటి ప్రమాదం ఉందని తెలిసి కూడా టేబుల్‌ టాప్‌లు ఎందుకని ప్రయాణికులు అడుగుతున్నారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *