June 7, 2023

యోగి ఆదిత్యనాథ్‌. ఉత్తర ప్రదేశ్‌ అంటే ఇప్పుడు గుర్తొచ్చే పేరు ఇదే. భారత రాజకీయ చరిత్రలో.. ఇంత డారింగ్‌ అండ్‌ డాషింగ్‌ ముఖ్యమంత్రి ఇంకొకరు లేరు. ముక్కుసూటి తనం, ఎవ్వరు ఏమనుకున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే ధైర్యం ఆయన సొంతం. ఉత్తర ప్రదేశ్‌… చారిత్రకంగా ఒకప్పుడు రాముడు పాలించిన ప్రాంతం, పాండవులు ఏలిన నేల, బుద్ధుడు తిరిగిన భూమి. అయోధ్య, వారణాసి లాంటి అద్భుత పుణ్యక్షేత్రాలు కొలువైన దేవభూమి. ఇంత గొప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉండాలి? కానీ స్వతంత్రం అనంతరం పూర్తిగా ఉత్తర ప్రదేశ్‌ గాడి తప్పిపోయింది. ఎప్పుడూ క్రైమ్‌ రేట్‌లో మాత్రమే ఉత్తర ప్రదేశ్ ముందుండేది. అలాంటి యూపీని కంట్రోల్‌ చేసి అభివృద్ధి పథంలో నడిపించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. అక్కడి క్రిమినల్స్‌కి యోగి అంటే వణుకు. లంచాలు మరిగిన అవినీతి అథికారులకు యోగీ రోజూ కలలోకి వస్తారు. యూపీ అభివృద్ధికి అతి పెద్ద అడ్డంకిగా మారిన అవినీతిపై యోగీ ఆదిత్యనాథ్‌ చేసిన యుద్ధం మామూలుది కాదు. ఒక సన్యాసి ముఖ్యమంత్రిగా ఏం చేస్తాడు అనుకున్నారు. ఇప్పడు ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అంటే… చాలా మంది విద్యావంతులు కూడా యోగిలా ఉండాలి అంటున్నారు. ఫలితాలు చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న యోగి ఆదిత్యనాథ్‌ అసలు ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి?

యోగి ఆదిత్యనాథ్‌ 1972లో అప్పటి ఉత్తరప్రదేశ్‌ ఇప్పటి ఉత్తరాఖండ్‌లోని పౌరిగడ్వాల్‌ జిల్లాలో పాంచూర్‌ అనే ఊళ్లో జన్మించారు. ఆయనది రాజ్‌పుట్‌ కుటుంబం. ఆయన సన్యాసి అని చదువు పెద్దగా లేదని అనుకుంటారేమో. యోగి ఆదిత్యనాథ్‌ మ్యాథ్‌మెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఉత్తరాఖండ్‌ని దేవ భూమి అంటారు. అద్భుతమైన దేవాలయాలు, గంగమ్మ పరవళ్లతో ఆ ప్రాంతం భారతీయ హైందవ సంస్కృతికి, ప్రాచీన దేవాలయాలకు చిరునామా. అలాంటి ప్రాంతంలో పుట్టిన ఆదిత్యనాథ్‌కి చిన్నప్పటి నుంచి వైరాగ్య భావాలు ఏర్పడ్డాయి. చిన్నప్పుడు చాలా మొహమాటస్తుడు. ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాద. సన్యాసిగానే బతకాలని చాలా చిన్నవయసులోనే నిర్ణయం తీసుకున్నారాయన. ఆదిత్యనాథ్‌ తండ్రి ఆనంద్‌ సింగ్‌ ఫారెస్ట్‌ రేంజర్‌గా పనిచేసేవారు.

1990ల్లో అంటే 18 ఏళ్ల వయసులోనే ఆయనను భారతీయ జనతా పార్టీ ఆకర్షించింది. అయోధ్య రామాలయ ఉద్యమంలో ఆయన చేరారు. అలా ఒక కార్యకర్తగా బీజేపీలో ఆయన ప్రస్థానం మొదలైంది. అప్పటికే ఆదిత్యనాథ్‌… గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి అయిన మహంత్‌ అవైద్యనాథ్‌కి ముఖ్య శిష్యులు. 2014లో మహంత్‌ అవైధ్యనాథ్‌ శివైక్యం అయ్యారు. ఆ తర్వాత ఆ పీఠానికి మహంత్‌గా ఆదిత్యనాథ్‌ ఎంపికయ్యారు. మహంత్‌ అంటే పీఠాధిపతులు. ఒక సన్యాసిగా అది చాలా ఉన్నతమైన స్థానం. ఆ తర్వాత ఆదిత్యనాథ్‌ శైవ సంప్రదాయంలో ప్రసిద్ధమైన నాద యోగి సంప్రదాయాన్ని పాటించారు. అలా మహంత్‌ ఆదిత్యనాథ్‌… యోగీ ఆదిత్యనాథ్‌ అయ్యారు. ఆ తర్వాత ఆయన జీవితం అత్యంత సాధారణ సన్యాసిగానే గడిచింది.

1996లో ఆదిత్యనాథ్‌ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పట్లో హిందూ మహాసభకు యోగి గురువు మహంత్‌ అవైద్యనాథ్‌ అధ్యక్షులు. ఉత్తర ప్రదేశ్‌లోనూ, కర్ణాటకలోనూ మఠాలకు, రాజకీయాలకు సంబంధాలు బాగా ఉంటాయి. అలాగే హిందూ ధర్మ రక్షణలో భాగంగా బీజేపీ పార్టీకి, RSSకి ఉత్తర ప్రదేశ్‌ మహంత్‌లు మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ ప్రచారాలకు మఠం తరపు నుంచి ఇంఛార్జ్‌గా యోగి ఆదిత్యనాథ్‌ని… మహంత్‌ నియమించారు. అలా యోగి జీవితం… ఆశ్రమం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చింది. అప్పట్లో హైందవ ధర్మం, భారత దేశ అమూల్య చరిత్రను యువతలోకి తీసుకెళ్లేందుకు యోగి స్థాపించిన హిందూ యువ వాహిని చాలా పెద్ద సక్సెస్‌. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పుడు బీజేపీలో ప్రధాన స్థానాల్లో ఉన్న చాలా మంది యువత ఒకప్పుడు యోగి అనుచరులుగా ఉన్నవారే. 1998లో యోగి ఆదిత్యనాథ్‌ మొదటిసారి బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 26 ఏళ్లే. అతి పిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన నాయకుడు యోగి. అప్పటి నుంచి గోరఖ్‌పూర్‌ నియోజకవర్గంలో యోగి ఆదిత్యనాథ్‌కి ఎదురు లేదు. ప్రజలు ప్రతీ ఎన్నికల్లోనూ ఆయనకే పట్టం కట్టారు. యూపీలో మాయావతి హయాం ఉన్నా, ములాయం హయాం ఉన్నా… గోరఖ్‌ పూర్‌లో మాత్రం ఎప్పుడూ యోగీ పవరే ఉండేది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు యూపీలో అమలు చేసిన చాలా కార్యక్రమాలు ఒక ఎంపీగా ఆయన తన నియోజకవర్గానికి ఆనాడే చేశారు. యూపీ అంతా క్రైమ్‌ రేట్‌ ఎక్కువగా ఉన్నా గోరఖ్‌ పూర్‌లో తక్కువ ఉండేది. కారణం యోగి ఆదిత్యనాథ్‌. యోగీ ఉంటేనే సేఫ్‌గా ఉంటాం అనే ప్రజల నమ్మకమే.. ఆయన్ను గెలిపించింది. అలా వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికై యోగీ రికార్డ్‌ సృష్టించారు.

సాధారణంగా సెలబ్రిటీలంటే ప్రజలు నీరాజనాలు పడతారు. కానీ ఒక సన్యాసికి ఈ స్థాయిలో క్రేజ్‌ ఉండడం రేర్‌. అందులోనూ యూపీలో యువతకు యోగీ ఒక హీరో. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌కి యోగి ఒక పెద్ద అండ. బీజేపీకి ఇప్పుడు యోగీనే స్టార్‌ కాంపైనర్‌. ఆయన ఎక్కడికి వచ్చినా యూత్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. నిజానికి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులే గుర్తుండరు. కానీ యోగి ఆదిత్యనాథ్‌ దేశమంతా తెలుసు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అక్కడ బలం ఉన్నవాడిదే రాజ్యం. అలాంటి చోట ఒక సన్యాసి ముఖ్యమంత్రి కావడం అంటే అదో వండర్‌. కానీ మోడీ పీఎం అయ్యాక.. చాలా నమ్మకంతో యోగీ అదిత్యనాథ్‌ని యూపీ సీఎంని చేశారు. మోదీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. పైగా యూపీలో బీజేపీకి స్ట్రాంగ్‌ బేస్‌ని ఏర్పరిచారు యోగి. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. అని ప్రజలంతా అనుకునేలా చేశారు. ముఖ్యమంత్రి అవగానే యోగీ తన విశ్వరూపాన్ని చూపించారు. అంతవరకు యూపీలో రికమెండేషన్‌లు, లంచాలు ఉంటేగానీ గవర్నమెంట్‌ ఆఫీసుల్లో పనులు జరిగేవి కావు. యోగీ రాగానే పాత ఫైళ్ల దుమ్ము దులిపించారు. పనులకు గడువు పెట్టారు. ఆ గడువులోగా పని కాకపోతే ఎందుకు కాలేదో ఆ ఆఫీసర్‌ ఎవరైనా ఎక్స్‌ప్లనేషన్‌ రాసివ్వాలి. లేదంటే ఉద్యోగం అవుట్‌. అంతకు ముందు వరకు గవర్న్‌మెంట్ ఆఫీసుల గోడలు గుట్కా మరకలతో ఎరుపెక్కిపోయాయి. యోగీ గుట్కాలను నిషేధించారు. కార్యాలయాల్లో ఎవరైనా గుట్కా నమిలితే సస్పెషనే. ఇప్పుడు ఆఫీసులు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉన్నాయి. గోవుల అక్రమ రవాణాని నిషేధించారు. అవినీతిని, క్రైమ్‌ని అరకట్టలేని ఆఫీసర్స్‌, పోలీసులను వందల సంఖ్యలో సస్పెండ్‌ చేశారు యోగి. క్రైమ్‌ రేట్‌ని తగ్గించేందుకు హోమ్‌ మినిస్ట్రీని తన దగ్గరే ఉంచుకున్నారు యోగి. ఉత్తర ప్రదేశ్‌లో ఒకప్పుడు వీధికో డాన్‌ ఉండేవాడు. ఇప్పుడు వాళ్లంతా వీధుల్లోకి రావడానికి కూడా భయపడుతున్నారు. మాఫియా అన్న మాట వినిపిస్తే దానికి బదులుగా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో తూటా శబ్దం వినిపిస్తోంది. కారణం యోగి. ముఖ్యంగా ఒకప్పడు బలవంతుల ఇష్టారాజ్యంగా ఉండే ఉత్తరప్రదేశ్‌ని యోగి కంట్రోల్‌లో పెట్టిన విధానాన్ని దేశమంతా మెచ్చుకుంది. ఇక ఆయన హయాంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం ఓ చారిత్రక ఘట్టం. ఎప్పుడో 6 వందల ఏళ్ల క్రితం కాశీ విశ్వనాథ ఆలయాన్ని రాణీ అహల్యా బాయి పునర్నిర్మించారు. అప్పటి నుంచి రాజులు పట్టించుకున్నారు గానీ… స్వతంత్రం తర్వాత నేతలు కాశీని పట్టించుకున్నది పెద్దగా లేదు. కానీ యోగీ హయాంలో కాశీ వీధులు కళకళలాడాయి. ముఖ్యంగా కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌… వారణాశి చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం. ప్రతీ హిందువు జీవితంలో ఒక్కసారైనా వారణాసి చూడాలనుకుంటారు. ఒక సన్యాసిగా హైందవ ధర్మానికి ఆయన చేసిన ఈ సేవ ఎప్పటికీ గుర్తుండిపోయేదే. అవినీతి మరకలు లేని నాయకుల్లో యోగి ముందుంటారు. కట్టింది కాషాయం. అత్యంత సాధారణ జీవితం ఆయనది. ముఖ్యమంత్రి ప్రోటోకాల్స్‌ని ఆయన చాలా వరకు తగ్గించేశారు. ఎక్కడికి వెళ్లినా అవే దుస్తులతో వెళ్తారు. తనకంటూ ఏమీ అక్కర్లేదని చెప్పే యోగి… తన చుట్టూ అవినీతి ఉంటే కూకటి వేళ్లతో పెకలిస్తున్నారు. దేశ రాజకీయాలను ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాలే శాసిస్తాయి. అంత పెద్ద రాష్ట్రం అది. అన్నీ పరిత్యజించిన ఒక సన్యాసికి… దర్మసంస్థాపనార్ధం… శక్తిని ఇస్తే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పేందుకు యోగీ ఆధ్యాత్మిక, రాజకీయ జీవితమే పెద్ద ఉదాహరణ.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *