May 30, 2023

విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి

విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి

ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే 4కే కెమెరాలు ఆయన నిండుతనాన్ని కాప్చుర్ చేయాలని తహతహలాడేవి. ఈ కాలంలో ఆ మహనీయుడు ఉంటే… రంగురంగుల వెండితెర పులకించిపోయేది. అయితేనేం 70ఎంఎంలు, డాల్బీలు, కలర్, గ్రాఫిక్స్ లేని రోజుల్లో నలుపు తెలుపుల తెరమీదే విశ్వరూపం చూపిన నటుడు ఎస్వీ రంగారావు. కళ్లలోనే రౌద్రం, రాక్షసం, సరసం, క్రౌర్యం, శృంగారం, కరుణ చూపిన నటుడాయన.
ఇప్పుడున్న ఆధునిక యుగంలో కూడా మాయాబజార్ లాంటి సినిమాని రీమేక్ చేయడం, ఆనాటి లుక్ తీసుకురావడం సాధ్యం కాదు. ఎందుకంటే.. అక్కడున్నది ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి… వీళ్లకు ఆల్టర్నేటివ్స్ లేరు. కేవీ రెడ్డి లాంటి దర్శకులూ రారు. మరో వందేళ్ల తర్వాత కూడా ఊహించడం కష్టమే. ముఖ్యంగా ఘటోత్కచుడిగా ఎస్వీఆర్ విశ్వరూపం ఎన్ని జెనరేషన్స్ వచ్చినా మర్చిపోలేరు. నా ఉద్దేశంలో ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఎస్వీఆర్ ఒకరు. కారణాలేంటో గానీ.. ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదు. నటనా పాఠాల్లో ఎస్వీఆర్ ఒక ప్రత్యేక స్కూల్. ఆయన పోషించినన్ని పాత్రలు, ఆయన ప్రదర్శించిన హావభావాలు ఇండియన్ స్క్రీన్ మీద మరెవరికీ సాధ్యం కాలేదన్నది వాస్తవం. విలనిజం, రాక్షసం, క్రూరత్వం, కరుణ, హాస్యం ఇలా ఆయన ప్రదర్శించిన పాత్రలన్నీ బెంచ్ మార్కులే. జూలై 3న ఆయన శత జయంతి అన్న విషయం ఈ తరం వారికి చాలా మంది తెలియదు. అంతెత్తు విగ్రహం, గాంభీర్యం ఇలా చెప్తూపోతే… ఆయన ఎస్వీఆర్ కాదు.. యశస్వీరావు. నూజివీడులో జన్మించిన సామర్ల వెంకట రంగారావు 1946లో ఇండస్ట్రీకి వచ్చారు. అప్పటికే నాటకాల్లో మంచి పేరున్న రంగారావు వరూధిని అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ చిత్రంలో రంగారావు హీరో, అలనాటి హాస్యనటి గిరిజ తల్లి తిలకం హీరోయిన్. ఆ చిత్రం అంతగా ఆడలేదు. ఆ తర్వాత రెండేళ్లు జంషెడ్ పూర్ వెళ్లి టాటా సంస్థలో పనిచేశారు. కానీ, మనసులో ఉన్న కళ ఎక్కడా నిలవనియ్యదు. అందుకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వెండితెరను ఏలడానికే అన్నట్టు మద్రాసు చేరుకున్నారు. 3 దశాబ్దాల నటనా ప్రస్థానంలో 5 భాషల్లో 200 చిత్రాల్లో ఎస్వీఆర్ జీవించారు. మొదటి చిత్రం నిరాశ పరిచింది. తర్వాత కూడా వెంటనే పాత్రలేం రాలేదు. షావుకారు చిత్రంతో మంచి ఫౌండేషన్ పడింది కానీ.. ఏదో అసంతృప్తి మన విశ్వనటుడిని వెంటాడింది. ఇక ఉద్యోగమే శరణ్యం అనుకుంటున్న దశలో… సాహసం శాయరా ఢింబకా.. అంటూ కేవీ రెడ్డి పలకరించారు. విజయావారి భారీ బడ్జెట్ చిత్రం పాతాళ భైరవి చిత్రంలో మాంత్రికుడి కోసం వెతుకుతున్నప్పుడు… కేవీ రెడ్డికి ఎస్వీఆర్ కనిపించారు. పాతాళ భైరవి పెద్ద హిట్. ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ తెచ్చిన చిత్రమిది. సాహసం శాయరా ఢింబకా…ఆ ఒక్క డైలాగ్ తో ఎస్వీఆర్.. సిల్వర్ స్క్రీన్ దుమ్ము దులిపేశారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. మాయాబజార్ ఘటోత్కచుని పాత్రలో ఎస్వీఆర్ యశస్వి ఆకాశమంత ఎత్తుకి ఎదిగింది. వెంటనే నర్తన శాల కీచకుని పాత్రలో ఆయన చూపిన క్రూరత్వం నభూతో నభవిష్యతి. నాటి జాకార్తాలో జరిగిన ఆఫ్రో-ఆసియన్ ఫిలిం ఫెస్టివల్స్ లో మెరిసిన చిత్రం నర్తన శాల. పాండవ వనవాసం- భక్త ప్రహ్లాదల్లో రాక్షసత్వం చూపించినా, బంగారుపాప-తాతామనుమడు లాంటి చిత్రాల్లో కారుణ్యం ఒలికించినా, సంపూర్ణ రామాయణం లాంటి చిత్రాల్లో పౌరాణిక పాత్రల్లో జీవించిన ఎస్వీఆర్ కే చెల్లింది. వెండితెరపై యముడంటే మనకు కైకాల సత్యనారాయణే గుర్తొస్తారు. అంతకు ముందు సతీ సావిత్రి, దేవాంతకుడు చిత్రాల్లో యముడిగా మెప్పించిన నటుడు యశస్వి. ఇక మిస్సమ్మ, గుండమ్మ కథ, పండంటి కాపురం లాంటి సాంఘిక చిత్రాల్లో ఎస్వీఆర్ నటన అద్వితీయం. తనకే సొంతమైన వాచకం, విగ్రహంతో.. వెండితెర అంతా నిండుగా కనిపించే నటులు చాలా అరుదు. అలాంటి నటులు ప్రపంచమంతా వెదికినా వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.

రంగారావు జీవితంలోనూ ఆటు పోట్లున్నాయి. చాలా మంది నటుల జీవితగాధల్లాగే.. రంగారావు కూడా నిర్మాతగా మారి నష్టాలు చూశారు. ఆయన తీసిన నాదీ ఆడ జన్మే సినిమా మంచి పేరు తీసుకొచ్చినా… డబ్బులు అంతగా రాలేదు. దర్శకుడిగా తీసిన చదరంగం, బాంధవ్యాలు అవార్డులు తెచ్చిపెట్టాయి కానీ కాసులు కురిపించలేకపోయాయి. షూటింగ్ లకి ఆలస్యంగా వస్తారని విమర్శలున్నా.. ఎంత పెద్ద డైలాగైనా, ఎంత లెంగ్దీ సీన్ అయినా సింగిల్ టేక్ లో కొట్టేసేవారట. క్యారెక్టర్ అర్టిస్ అంటే బ్రాండ్ నేమ్ ఎస్వీఆర్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఇంత గుర్తింపు ఉందంటే అది ఎస్వీఆర్ లాంటి వాళ్ల పుణ్యమే. ఎస్వీఆర్ గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను ఒకే ఒక్కడు యశస్వి అనే పేరుతో సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు పుస్తకం మార్కెట్ లో దొరుకుతోంది.

ఎస్వీఆర్ జీవితంలో ఆసక్తికర విషయాలు…
అలనాటి అందాల తార లక్ష్మిని వెండితెరకు పరిచయం చేసింది ఎస్వీఆరే. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన బాంధవ్యాలు లక్ష్మి తొలి చిత్రం.
కుమారుడిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నారు ఎస్వీఆర్. కొన్నాళ్లు షూటింగ్ కూడా చేశారు. ఎందుకోమరి ఆ సినిమా ఆగిపోయింది.
ఎస్వీఆర్ కి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లో జర్మన్ షెపర్డ్స్ ఉండేవి.
ఎస్వీఆర్ కవి, రచయిత కూడా. చాలా పత్రికలు కథలు పంపేవారు. క్రికెట్, పేయింటింగ్ అంటే ఇష్టం. వేట అంటే చాలా మక్కువ.
షేక్స్ పియర్ అంటే రంగారావుకి ఎంతో అభిమానం. మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఇష్టమైన నాటకం. అందులో విలన్ పాత్రధారి షైలాక్.
పాతాళ భైరవి చిత్రంలో మాంత్రికుడి పాత్ర మేకప్ కూడా షైలాక్ పాత్రలానే ఉంటుంది.
ఇప్పటి సినిమాల్లో విలన్లు ఏదో ఒక పదాన్ని ఊతపదంగా వాడుతున్నారు. ఈ ట్రెండ్ తెచ్చింది ఎస్వీఆరే. జగత్ జట్టీలు సినిమాలో
ఎస్వీఆర్ డొంగ్రే అన్న డైలాగ్ అంటారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఈ స్టైల్ ట్రెండ్ సెట్ అయింది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *