కార్పోరేట్ కాలేజీల్లో చదువులు బాగుంటాయని.. తమ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని.. చెమటోడ్చి కష్టపడినదంతా ఊడ్చి మరీ కళాశాలలకు ఇస్తున్నారు మధ్యతరగతి తల్లిదండ్రులు. రక్తం పీల్చినట్టు ఫీజులు గుంజుతున్నా, ర్యాంకుల సమరంలో తమ పిల్లలు ముందుండాలని అప్పోసొప్పు చేసి, పర్సనల్ లోన్లు తీసుకుని
మరీ ప్రైవేటు కళాశాలల్లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ చెప్పే నిజంగా చెప్పే చదువు గోరంత, ఎంత డబ్బుకి అంత చదువు పేరిట రాచి రంపాన పెట్టేది కొండంత అన్నది విద్యార్థుల ఆత్మఘోషలే చెప్తున్నాయి. విద్యను అంగడి వస్తువుగా మార్చేసి, విద్యావ్యవస్థను సమూలంగా ఏమార్చేసిన పాపపు వ్యవస్థ… కార్పోరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. డబ్బులిస్తే ర్యాంకులు కూడా అమ్ముతాం అని నిరూపించుకున్నాయి కార్పోరేట్ కళాశాలలు. ఇందుకు ఎం సెట్ ప్రశ్నాపత్రం స్కాం ఉదంతాన్ని మించి వేరే ఉదాహరణలు అవసరం లేదు. ప్రాణం పోసే వాడు వైద్యుడు. నిబద్ధతతో వైద్య విద్య అభ్యసించి ప్రాణాలు నిలిపితే.. ఆ వైద్యుడిని దేవుడిగా కొలిచే సంప్రదాయం మనది. అదే వైద్య విద్యను అంగట్లో పెట్టి అమ్మితే, డబ్బుతో ర్యాంకులు కొనుక్కుంటే.. ఆ చదువు రాని చవటలు.. ర్యాంకులు కొనుక్కుని డాక్టర్ సర్టిఫికెట్లు అడ్డగోలుగా సంపాదించి…రేపు ఆపరేషన్లు చేసి మనుషుల్ని చంపితే దిక్కెవరు. 2016 ఎంసెట్-2 కేసులో జరిగిందిదే. ఏప్పుడో రెండేళ్ల క్రితం కేసు నమోదైతే.. ఇప్పటికి చలనం వచ్చింది. ఈ అరాచకాన్ని ప్రభుత్వం హై ప్రొఫైల్ కేసుగా పరిగణించింది. ఇప్పటి వరకు చాలా మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఇందులో హైదరాబాద్ చైతన్యపురిలో శ్రీ చైతన్య కళాశాల డీన్ వాసుబాబు, చైతన్య-నారాయణ కళాశాలల అడ్మిషన్లు చూసే కీలక ఏజెంట్ ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం అసలు జరిగిందేంటటే..2016 ఎంసెట్-2లో క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు వచ్చాయి. కోల్ కతా, ముంబయ్, మహారాష్ట్ర్ర, బెంగళూరు, భుబనేశ్వర్, కటక్ కేంద్రాలుగా విద్యార్థులకు 320 ప్రశ్నలు, వాటి జవాబులతో శిక్షణ ఇప్పించారు. 2016 జూలై 9న జరిగిన ఎంసెట్ పరీక్షలో పాల్గొన్న ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయి. ఇందుకు ఒక్కో స్టూడెంట్ నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేశారు. విషయం తెలియగానే శ్రీ చైతన్య యాజమాన్యం… వాసుబాబుని తొలగించింది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఇలాంటి అవకతవకలకు పాల్పడలేదని యాజమాన్యం సెలవిస్తోంది. ఇంత పెద్గ స్కాంలో పెద్దల ప్రోద్బలం లేదంటే నమ్మేవాళ్లెవరూ లేరు. ఇందులో రాజకీయ నాయకులు, కొందరు పెద్దలు, కొందరు పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. ఈ అరాచకం జరిగి రెండేళ్లైనా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ స్కామ్ ని ఇప్పటి వరకు ఎవరూ ఎందుకు పట్టించుకోలేదన్నది కార్పొరేట్ మిస్టరీ. ఇందులో చాలా మంది ప్రమేయం ఉందని విచారణల ద్వారా తెలుస్తోంది. ఇంత పెద్ద స్కామ్ ని ఒకటి రెండు మీడియా సంస్థలు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. అన్నీ సోసో వార్తలే. ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి కమలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కష్టడీలోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీనికి సమాధానం లేదు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన రావత్ కూడా కస్టడీలోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ విషయంపైనా సీఐడీ నోరు మెదపడం లేదు. ఈ కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటి వరకు 8 మంది దర్యాప్తు అధికారులు మారారు. ఇదీ అనుమానాలకు తావిస్తోంది. నిజంగా ఈ వ్యవహారంతో ఆయా కళాశాలల యాజామాన్యాలకు సంబంధం లేకపోతే.. ఇప్పటి వరకు ఈ కేసుపై అంతర్గత చర్యలెందుకు లేవు…? ఇలాంటి ప్రశ్నల మధ్య ఈ కేసు ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఏదీ ఏమైనా 35 లక్షలుంటే ఏ చవటైనా వైద్యుడైపోవచ్చన్నమాట… పిల్లలు విద్యను ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ చదవాలి. ర్యాంకుల మధ్య నలిగిపోయి, ర్యాంకు రాకపోతే ఇక చదువు రానట్టే అనేలా విద్యా పోకడలు, డబ్బున్న వాడికే చదువు అన్న కార్పోరేట్ సిద్ధాంతాల మధ్య… మన విద్యా వ్యవస్థ సమాధి స్థితిలో ఉంది. ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దే నిధులున్నాయి. కార్పొరేట్ కళాశాలల్లో ముప్పావు వంతు అధ్యాపకులు కనీస జ్ఞానం, అర్హతలు లేనివారు… కనీసం చదువెలా చెప్పాలో తెలియని వారేనని వారి రుబ్బుడు వ్యవహారం చూస్తేనే అర్థమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నిపుణులు, అన్ని విధాల అర్హతలున్న అధ్యాపకులకు బాసటగా కార్పొరేట్ రేంజ్ లో సౌకర్యాలుంటే.. ప్రేవేటు విద్యా వ్యవస్థ షట్టర్లు మూసుకోవాల్సిందే. కానీ ఆ పని చేయరు.. ఇందుకు ‘శత కోటి’ కారణాలు. అదే పిల్లల తలరాతను ఏమార్చేస్తోంది. కార్పొరేట్ విద్యా మాయాగాలం స్టూడెంట్స్ జీవితాలను ఏ దిశా లేకుండా, గాలిలో దీపాల్లా మారుస్తోంది.