May 30, 2023

కొంతమందికి మరణం భౌతికంగా మాత్రమే ఉంటుంది. వారు మానసికంగా మనతోనే ఉంటారు. కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ని అతని ఫ్యాన్సే కాదు బహుశా ఎవరూ మర్చిపోలేరు. ఆయన కొత్త సినిమా గంధద గుడి టీజర్‌ విడుదలైంది. అద్భుతమైన ప్రకృతి, అండర్‌ వాటర్‌లో అన్వేషణకథలో ఏదో దాగున్న మిస్టరీ టీజర్‌లో కనిపిస్తున్నాయి.

ఈ సినిమాను చాలా కాలంగా పునీత్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్తున్నారు. ఇదొక వైల్డ్‌ లైఫ్‌ మూవీ. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో వచ్చిన సినిమా అని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. పునీత్‌ మంచి నటుడు, మంచి నిర్మాత కూడా. మంచి కథలు దొరికితే సినిమాలు తీసేవారు. ఆయన నిర్మాతగా తీసిన సినిమాలన్నీ హిట్టే. అలా ఈ గంధదగుడి సినిమాకు కూడా పునీత్‌ నిర్మాత. ఈ సినిమా నవంబర్‌లోనే రీలీజ్‌ అవ్వాలి. కానీ పునీత్‌ ఆకస్మిక మరణం వల్ల రిలీజ్‌ ఆగింది. వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌, దర్శకుడు అమోఘ వర్ష కూడా ఈ మూవీలో నటించారు. ఈ సినిమాకు అతనే డైరెక్టర్‌. గత ఏడాదిగా షూటింగ్ నడుస్తోందని, పునీత్‌ ఈ సినిమా కోసం బాగా తపించారని, సినిమా మొత్తం మ్యాకప్‌ లేకుండా ఈ సినిమాలో ప్రకృతి సౌందర్యం షాట్స్‌ కట్టిపడేస్తాయని అమోఘ వర్ష చెప్పారు.

అప్పు నటించిన చివరి సినిమా కాబట్టి టీజర్‌ చూసి కన్నడ అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు.ఒకప్పుడు కన్నడ సినిమాలు ఆ రాష్ట్రానికే ఎక్కువ పరిమితమయ్యాయి. కేజీఎఫ్‌తో కన్నడ మూవీ స్థాయి పాన్‌ ఇండియాకు చేరుకున్నాయి. కన్నడలో కూడా సినిమాలు అద్భుతమైన క్వాలిటీతో వస్తున్నాయి. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా పునీత్‌ కళ్లల్లో ఏదో తెలియని ఆనందం కనిపించేదని కేజీఎఫ్ స్టార్‌ యష్‌ అన్నారు. అప్పు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అని పునీత్‌ భార్య అశ్విని కూడా ట్వీట్‌ చేశారు.

ఈ సినిమా గురించి అప్పు కూడా చెప్తుండేవారు. ఈ కథ ఇప్పటిది కాదని దశాబ్దాల క్రితం నాటిదని ఇన్నాళ్లు తెరమీదకు తేగలిగాం అని పునీత్‌ చెప్తుండేవారు. మరోసారి చరిత్రను వెనక్కు తీసుకెళ్లి, మన దేశం ఎంత గొప్పదో చెప్పే అద్భుతమైన సినిమా అని అప్పు చెప్పేవారు. ఆ అద్భుతం టీజర్‌లో కనిపిస్తోంది కూడా.

గంధద గుడి అనే పేరుతో కన్నడలో ఇంతకు ముందు కూడా సినిమాలు వచ్చాయి. 1973లో పునీత్‌ తండ్రి కన్నడ సూపర్‌ స్టార్‌ రాజకుమార్‌ హీరోగా ఒక సినిమా వచ్చింది. అది సూపర్‌ హిట్‌. ఆ తర్వాత ఇదే పేరుతో రాజ్‌ కుమార్‌ కుమారుడు శివ రాజ్‌ కుమార్‌ సినిమా కూడా వచ్చింది. గంధదగుడి అంటే గంధం అని అర్థం. అడవి అనే అర్థం కూడా వస్తుంది. అడవుల రక్షణ, వన్యమృగాలను కాపాడుకోవడం 1973 నాటి గంధద గుడి కథ. దాదాపు అలాంటి కథే ఈ టీజర్‌లోనూ కనిపిస్తోంది. ఇది సినిమా కాదని డాక్యుమెంటరీ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. కానీ టీజర్‌ చూస్తే అలా అనిపించడం లేదు.

కథను చాలా సీక్రెట్‌గా ఉంచారు. ఆ థ్రిల్‌ థియేటర్లో చూస్తేనే బాగుంటుందనేమో. మొత్తానికి ఈ సినిమా పునీత్‌ ఎమోషన్‌తో కలగలిపిన ప్రకృతి దృశ్యం. ఆ ఎమోషన్‌ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *