June 7, 2023

రాష్ట్రం కాని రాష్ట్రం దిల్లీ – చారిత్రక నేపథ్యం

రాష్ట్రం కాని రాష్ట్రం దిల్లీ – చారిత్రక నేపథ్యం

దిల్లీ అటు రాష్ట్రమూ కాదు ఇటు రాష్ట్రం కాకుండానూ పోలేదు. రాష్ట్రాలకు ఉన్నట్టే దిల్లీకి శాసనసభ ఉంది. మిగతా 29 రాష్ట్రాలకు గవర్నర్లు ఉంటే దిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. గవర్నర్ల పదవులు అలంకారప్రాయమైనవి. కానీ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుకు ఇతర గవర్నర్లకు మించిన అధికారాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల గవర్నర్లు ఆ రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకు నడుచుకోవాల్సి వస్తుంది. కాని లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా రాష్ట్రపతికి మాత్రమే అంటే నిజానికి కేంద్ర ప్రభుత్వానికే జవాబుదారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయానికి మధ్య తేడా వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి సలహా మేరకు వ్యవహరించాలి. రాష్ట్రపతి సలహా అందడం ఆలస్యమైతే తన ఇష్టానుసారం వ్యవహరించవచ్చు. మంత్రివర్గ అభిప్రాయాన్ని ఖాతరు చేయవలసిన అవసరం లేదు. కేజ్రీవాల్‌కూ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు, మునుపటి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు మధ్య పొరపొచ్చాలతో ఆగకుండా తీవ్ర విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణం ఈ విశేష అధికారాలే. దిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగానో, కేంద్ర పాలిత ప్రాంతంగానో పరిగణించకుండా దేశ రాజధాని అయినందువల్ల జాతీయ రాజధాని ప్రాంతం అనడంలోనే చిక్కంతా ఉంది. శాసనసభ, మంత్రివర్గం ఉన్నప్పటికీ దిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలు చాలా పరిమితం. రాజ్యాంగంలోని 239 ఎ ఎ అధికరణమే దీనికి కారణం. దిల్లీ ప్రభుత్వానికి బాధ్యతలు ఎక్కువ. అధికారాలు స్వల్పం.దిల్లీ శాసన సభకు 2015లో ఎన్నికలు జరిగినప్పుడు కేజ్రీవాల్ పూర్తి రాష్ట్ర స్థాయి సాధిస్తామని వాగ్దానం చేశారు. ఆ మాటకొస్తే కాంగ్రెస్, బిజెపి కూడా తమ ఎన్నికల ప్రణాళికల్లో ఇదే వాగ్దానం చేసి ఇప్పుడు బిజెపి ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఉంటే కాంగ్రెస్ కాళ్లీడుస్తోంది. దిల్లీకి పూర్తి రాష్ట్ర స్థాయి కల్పించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అయినా ఎన్నికల వాగ్దానం మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం 2016లో ‘దిల్లీ రాష్ట్ర బిల్లు’ను ఆమోదించింది. కానీ కేంద్రంలోని బిజెపి సర్కారు ఈ బిల్లును ఆమోదించలేదు. క్రీ.శ. 1220లో తున్వర్ రాజపుత్రులు ఇల్తుమిష్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా దిల్లీని ఏర్పాటు చేశారు. అక్బర్ ఏలుబడిలో దిల్లీకి సుబా హోదా ఉండేది. పత్పార్ గంజ్ (తూర్పు దిల్లీలోని ప్రాంతం)లో 1803లో ‘దిల్లీ యుద్ధం’ ముగిసిన తర్వాత పొరుగున ఉన్న హిసార్, రోహ్తక్, గూర్గావ్, కర్నాల్ జిల్లాలను కలిపి దిల్లీని ఒక విభాగంగా మార్చి చీఫ్ కమిషనర్ కు పరిపాలనా బాధ్యతలు అప్పగించారు. 1857 నాటి ప్రథమ భారత సంగ్రామంలో దిల్లీని స్వాధీనం చేసుకోవడమే ప్రధానాంశం అయిందంటే దానికి ఉన్న ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అప్పుడే దిల్లీని పొరుగున ఉన్న పంజాబ్ లో కలిపేసి అంతకు ముందున్న స్వయంప్రతిపత్తి లేకుండా చేశారు. 1911లో బ్రిటిష్ పాలకులు తమ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చిన తర్వాత దిల్లీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి పరిపాలనా బాధ్యతలు మళ్లీ చీఫ్ కమిషనర్‌కు అప్పగించారు. 1919, 1935 నాటి చట్టాల కారణంగా దిల్లీ కేంద్ర పాలనలోని ప్రాంతంగా మారింది. 1947లో స్వాతంత్య్రం రావడానికి ముందు చీఫ్ కమిషనర్ ఏలుబడిలో ఉన్న ప్రాంతాల వ్యవహారాలు పరిశీలించడానికి మార్పులు, చేర్పులు సూచించడానికి పట్టాభి సీతారామయ్య కమిటీ ఏర్పాటు చేశారు. ‘ఇతర ప్రాంతాల ప్రజలకు ఉన్న స్వయం పాలనాధికారం దిల్లీ ప్రజలకు లేకుండా చేయడానికి వీలు లేదు’ అని గుర్తించిన సీతారామయ్య కమిటీ అజ్మీర్, కేక్రి, కూర్గ్ లాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఏలుబడిలో ఉండాలని సూచించడం ఓ వైపరీత్యం. రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.1948లో సిద్ధం చేసిన ముసాయిదాలో దిల్లీకి మంత్రివర్గం ఉండాలని, అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దిల్లీ పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్ణాయక సభ ముసాయిదా కమిటీలో ఈ అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. లాలా దేశబంధు గుప్తా దిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఉండాలని గట్టిగా కోరారు. చివరకు భారత రాజ్యాంగ తుది ప్రతిలో అంటే రాజ్యాంగంలో పార్ట్ ఎ,బి, సి,డి అని నాలుగు రకాల రాష్ట్రాలు చేర్చారు. 1951 నాటి ‘ప్రభుత్వ పార్ట్ సి రాష్ట్రాల చట్టం’ ప్రకారం దిల్లికి శాసన సభ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఈ చట్టంలోని 21వ సెక్షన్ ప్రకారం దిల్లీ శాసన సభ రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు చేయడానికి అవకాశం కల్పించారు. అయితే శాంతి భద్రతలు, పోలీసులు, మంచి నీరు, డ్రైనేజీ, విద్యుత్తు, రవాణా, భూమి లాంటి మునిసిపల్ సేవలు, కోర్టుల పరిధిలోని అంశాలపై శాసనాలు చేయడానికి వీలు లేకుండా చేశారు. దిల్లీ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తికి అక్కడే గండి పడింది. దిల్లీకి స్వయం ప్రతిపత్తి భ్రమగా మిగిలిపోయింది. అసలైన అధికారాలు కేంద్రం గుప్పెట్లోకే వెళ్లిపోయాయి. ‘దిల్లీ దేశ రాజధాని కనక అసాధారణమైన పరిస్థితిలో ఉందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి నిర్నిబంధమైన అధికారాలు ఉండాలి’ అని అప్పటి కేంద్ర ప్రభుత్వం వాదించింది.చివరకు 1952లో దిల్లీ శాసనసభ ఏర్పడింది. చౌదరి బ్రహ్మ ప్రకాశ్ ముఖ్యమంత్రిగా 1955 దాకా కొనసాగారు. కాని ఆ ముచ్చట మూణ్నాళ్లలోనే ముగిసింది. 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేశారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది. 1951 నాటి ‘ప్రభుత్వ పార్ట్ సి రాష్ట్రాల చట్టం’ లోని 21వ సెక్షన్ రద్దయింది. నాలుగేళ్లలోనే దిల్లికి శాసన సభ ముచ్చట తీరిపోయింది. కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలింది. 1958లో దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కు అత్యవసర సేవలు అందించే బాధ్యత అప్పగించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను సంప్రదించి మునిసిపల్ కార్పొరేషన్ ఈ విధులు నిర్వహించాలన్నారు. విచిత్రం ఏమిటంటే ప్రస్తుత బిజెపికి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ దిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించింది. ‘దిల్లీకి పూర్తి రాష్ట్ర స్థాయి అంటే మొత్తం దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది’ అని జనసంఘ్ అప్రతిష్ఠాకరమైన వ్యాఖ్య చేసింది. 1956 దాకా దిల్లీని రాష్ట్రంగానే పరిగణించారు. అయితే మంత్రిమండలి ఉన్నా రాష్ట్రపతి నియమించే ప్రతినిధి కూడా ఉంటారు. రాజ్యాంగ నిర్ణాయక సభలో జరిగిన చర్చల సరళిని పరిశీలిస్తే దిల్లీ సొంత ప్రభుత్వంతో ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనే రాజ్యాంగ నిర్ణాయక సభ భావించినట్టు స్పష్టం అవుతుంది. 1956 నాటి ఏడవ రాజ్యాంగ సవరణ పుణ్యమా అని దిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా దిగజారింది. 1966లో కేంద్ర ప్రభుత్వం దిల్లీ పరిపాలనా చట్టం ద్వారా దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 56 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు చర్చలు జరపొచ్చు. సిఫార్సులు చేయవచ్చు. కాని అవి పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే అమలులోకి వస్తాయి.1975లో ఏర్పడిన ప్రభు కమిటీ దిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి గురించి కూలంకషంగా చర్చించింది. మంత్రిమండలి ఉండాలని, విభిన్నమైన పరిపాలనా వ్యవస్థలు ఉండకూడదని మంచి సిఫార్సులు చేసింది. కానీ 1979లో జనతా పార్టీ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోవడంవల్ల ఈ సిఫార్సులు అమలు కానేలేదు.1977లో లోక్‌సభలో కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి శాసనసభ ఏర్పాటు చేయడానికి రెండు బిల్లులు ప్రతిపాదించారు. కానీ ఆ బిల్లులు ఆమోదం పొందకుండానే కాలదోషం పట్టాయి. 1990లో అప్పటి హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ దిల్లీకి శాసనసభ ఏర్పాటు చేయడంకోసం 72వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు కూడా ఆమోదం పొందకుండానే జారిపోయింది. కడకు 1991 నాటి 69వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం దిల్లీకి శాసనసభ, ముఖ్యమంత్రి ఏర్పడే అవకాశం వచ్చింది. 2003 ఆగస్టు 18న అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్.కె.అద్వాణీ 102వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2003 నాటి దిల్లీ రాష్ట్ర బిల్లు ప్రతిపాదించారు. ఈ రెండింటినీ పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించారు. అప్పుడు హోం మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడుగా ఉండే వారు. 106వ స్థాయీ సంఘ నివేదిక దిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి కలిగించే విషయంలో ఉన్న రాజకీయాలను బహిర్గతం చేసింది. 102వ రాజ్యాంగ సవరణ బిల్లు 239 ఎ ఎ, 239 ఎ బి అధికరణాలను తొలగించడానికి ఉద్దేశించింది.2002లో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిల్లీకి పూర్తి రాష్ట్ర స్థాయి కల్పించాలని కోరుతూ శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది.1987లో దిల్లీ ప్రత్యేక పరిస్థితి మళ్లీ చర్చకు వచ్చింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ‘దిల్లీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ కమిటీ’ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దిల్లీకి జరిగిన అన్యాయంపై తీవ్రమైన విమర్శలు చేసింది. ‘మెట్రోపాలిటన్ కౌన్సిల్ కబుర్లు చెప్పుకోవడానికి తప్ప ఎందుకూ కొరగాదు. దిల్లీ ప్రజలకు తమకు కావాల్సిన శాసనాలు చేసే అవకాశం లేకుండా చేశారు. అధికార వర్గాలు ఎన్నికైన మెట్రోపాలిటన్ కౌన్సిల్ కు బాధ్యులు కారు’ అని విమర్శలు గుప్పించింది. దిల్లీ దేశ రాజధాని కనక కేంద్రమే నేరుగా పరిపాలించాలన్న వాదనను ఈ కమిటీ తోసిపుచ్చింది. దిల్లీకి రాష్ట్రప్రతిపత్తి ఉండాలని సిఫార్సు చేసింది. కాని చివరకు రాజ్యాంగం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగానె ఉంటుందని సిఫార్సు చేసి పెద్ద పొరపాటు చేసింది. అందువల్ల ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వంఉన్నా పార్లమెంటుకు, కేంద్ర ప్రభుత్వానికి ఆధిపత్యం చెలాయించే అవకాశం వచ్చింది. ఈ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి 1991 డిసెంబర్ లో పార్లమెంటు ఉభయ సభలు 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 239 ఎ ఎ, 239 ఎ బి అధికరణాలను రాజ్యాంగంలో చేర్చి ‘జాతీయ రాజధాని ప్రాంతం’ పరిపాలన ఎలా ఉండాలో నిర్దేశించారు. 239 ఎ ఎ అధికరణంలోని నాల్గవ క్లాజులో ఏం చేర్చారో పరిశీలిస్తే తిరకాసు ఎక్కడ ఉందో అర్థం అవుతుంది. ఈ క్లాజు కింద మంత్రివర్గం ఎలా ఏర్పడాలో చెప్తూనే ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాల మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాలని చెప్పారు. కానీ మంత్రిమండలికి, లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య విభేదాలు తలెత్తితే ఈ అంశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి నివేదించాలని, అయితే రాష్ట్రపతి సలహా సమయానికి అందకపోతే కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవచ్చని ఈ క్లాజులో పేర్కొన్నారు.
2015 మే 21న కేంద్ర హోంశాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వు పోలీసు, శాంతిభద్రతలు, భూమికి సంబంధించిన అంశాలలో మినహా లెఫ్టినెంట్ గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు వ్యవహరించాలన్న 1998 సెప్టెంబర్ 24నాటి ఉత్తర్వును వమ్ము చేసింది. 1998నాటి ఉత్తర్వు జారీ చేసింది అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వమే. కానీ మోదీ ప్రభుత్వం జారీ చేసిన 2015నాటి ఉత్తర్వు మునుపటి ఎన్.డి.ఎ. విధానానికి భిన్నంగా ఉండడానికి కారణం కచ్చితంగా కేజ్రీవాల్ మీద ఉన్న వ్యతిరేకతే. 2015నాటి ఉత్తర్వుపై కేజ్రీవాల్ ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. అయితే దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి, న్యాయమూర్తి జయంత్ నాథ్ 2015 నాటి ఉత్తర్వు చెల్లుతుందని తీర్పు చెప్పి వాజపేయి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును నిశ్చేష్టం చేశారు. దిల్లీలో ప్రభుత్వం పని చేయడానికి వీలు లేకుండా అనేక వ్యవస్థలు పని చేస్తాయి. దిల్లీ ప్రభుత్వం, తూర్పు, ఉత్తర, దక్షిణ మునిసిపల్ కార్పొరేషన్లు; కొత్త దిల్లీ, ల్యూటెన్స్ దిల్లీ అవసరాలు తీర్చే కొత్త దిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్.డి.ఎం.సి); దిల్లీ కంటోన్మెంట్ బోర్డు; దిల్లీ అభివృద్ధి వ్యవస్థ (డి.డి.ఎ.); లెఫ్టినెంట్ గవర్నర్; కేంద్ర ప్రభుత్వం – ఇలా అనేక వ్యవస్థల మధ్య దిల్లీ ప్రజలే కాకుండా దిల్లీ ప్రభుత్వమూ నలిగిపోతోంది. దిల్లీ ప్రస్తుత పరిస్థితి ఫెడరల్ విధాన స్ఫూర్తికే విరుద్ధం. దిల్లీకి నిజానికి కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్న హోదా కూడా లేదు. దిల్లీకి ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వడం ప్రధానమైన రెండు పార్టీలకు ఇష్టం లేదు. అందుకే దిల్లీ ‘మనో వైకల్యం’ గల రాష్ట్రంగా, ‘ద్వంద్వ ప్రవృత్తి’ గలదిగా, ‘కళ్లాలు మరెక్కడో’ ఉన్న ప్రాంతంగా మిగిలిపోయింది. దిల్లీ పోలీసుల మీద, దిల్లీ అభివృద్ధి వ్యవస్థ మీద, మూడు మునిసిపల్ కార్పొరేషన్ల మీద దిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేని స్థితిలో ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వమైనా చేసేది ఏమీ ఉండదు. పరిష్కారమల్లా దిల్లికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడమే. లేకపోతే ఫెడరల్ విధానం గురించి చెప్పేవన్నీ గాలి కబుర్లుగానే మిగిలిపోతాయి

ఆర్. వి. రామారావు
సీనియర్ పాత్రికేయులు
(జూన్ 24, 2018న మన తెలంగాణ పత్రికలో వచ్చిన వ్యాసం)

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *