పోలింగ్ డే వచ్చేస్తోంది. ఏప్రిల్ 11న అందరి జాతకాలు ఈవీఎంలో నిక్షిప్తం అవుతాయి. అభ్యర్థులు ఇక తొందరగా నామినేషన్లు వేసి ప్రచారాల్లో మునగాల్సిందే. ఏప్రిల్ 9 సాయంత్రం 5 గంటలకు ప్రచారాలకు గప్‌చుప్. 18వ తేది (సోమవారం) నుంచి ఏపీ, తెలంగాణల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 25 నామినేషన్ల స్వీకరణకు గడువు. 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణకు డెడ్‌లైన్. ఏపీలో ఓటర్లు 3 కోట్ల 82 లక్షల మంది ఉంటారని అంచనా. ఏపీ ఎన్నికల నిర్వహణకు 45 వేల 920 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది. ఎన్నికలకు 3 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. భద్రత కోసం 350 ప్లటూన్ల సీఆర్‌పీఎఫ్ బలగాలు ఏర్పాటు చేశారు. ఈ 15 వరకు ఓటర్ల నమోదు జరిగింది. 26లోగా ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధమైపోతుంది.
అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ కఠిన నిబంధనలు
–వేల మంది కార్యకర్తలు, పదుల సంఖ్యలో వాహనాల కాన్వాయ్‌లకు NO
–ఒక్కో అభ్యర్ధి కేవలం మూడు వాహనాలు మాత్రమే వినియోగించాలి.
–అఫీషియల్ వాహనాలు ప్రచారాలకు వినియోగించకూడదు
–అధికారిక కార్యక్రమాల్లో పార్టీ ప్రసంగాలు చేయకూడదు
–నామినేషన్ దరఖాస్తులో అన్ని ఖాళీలు పూరించాలి
–అభ్యర్థులపై క్రిమినల్ చార్జ్‌షీట్ ఉంటే నామినేషన్లో వివరించాలి
–నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు మొత్తం వీడియో కవరేజ్
–ఈ నెల 29-ఏప్రిల్ 9లోపు అభ్యర్థులు తమ కేసుల వివరాలు పేపర్లలో ప్రకటించాలి
–ఎలక్ట్రానిక్ మీడియాలో కేసుల వివరాలు ప్రసారం చేయాలి
–తమ అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ చార్జ్‌షీట్‌లను రాజకీయ పార్టీలు వారి వెబ్‌సైట్‌లో ఉంచాలి.
–రాత్రి 10 గంటల తర్వాత, ఉదయం 6 లోపు మైకులు, లౌడ్ స్పీకర్లు బంద్
–పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల ప్రచారం ఖర్చు రూ.70 లక్షలు
–అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి ప్రచారం ఖర్చు రూ.28 లక్షలు
–రోజూ లేదా 3 రోజులకు ఓ సారి ప్రచారం లెక్కలు రిటర్నింగ్ అధికారికి చెప్పాలి.
–ఖర్చు చూపించకపోతే మైక్రో అబ్జర్వర్లు చెప్పిన లెక్కలే వర్తిస్తాయి
–అభ్యర్థులు ఓవరేక్షన్ చేస్తే ఈసీ దృష్టికి పౌరులు తీసుకెళ్లొచ్చు
–సీ–విజిల్ యాప్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోండి
–ఓవరేక్షన్ చేసే అభ్యర్థుల ఫోటోలు, వీడియోలు అపలోడ్ చేస్తే 100 నిమిషాల్లో యాక్షన్.