June 7, 2023

RRR కథ… హిస్టరీనా? ఫిక్షనా?

అల్లూరి-భీమ్‌ రియల్‌ స్టోరీ ఇది

ట్రైలర్‌ వచ్చినప్పటి నుంచి టాలీవుడ్‌లో RRR తప్ప మరో టాక్ లేదు. ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. అయితే ఇంటర్వూల్లో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు మాత్రం రాజమౌళి క్లారిటీగా సమాధానాలు ఇవ్వడం లేదనే టాక్ కూడా జోరుగానే ఉంది. ఫస్ట్‌ నుంచి ఈ సినిమా కోసం ఆయన మన స్వతంత్ర వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల పేర్లు వాడుకున్నారు. వారిద్దరూ జీవించింది వేరు వేరు కాలాల్లో. అయినా వారిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందన్న పాయింట్‌కి ఫిక్షన్‌ జోడించామని చెప్తూ వచ్చారు. ఇప్పుడేమో ఈ కథ పూర్తిగా కల్పితం, అసలు వాళ్ల బయోగ్రఫీనే ఉండదు అంటున్నారు. ఆయన కథ కల్పితం కావొచ్చు, ఎన్ని ఫిక్షన్లైనా అల్లుకోవచ్చు.

కానీ… అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు మాత్రం ఫిక్షనల్‌ క్యారెక్టర్లు కాదు కదా. వారిద్దరూ చరిత్రలో సువర్ణాధ్యాయాలు లిఖించిన స్వాతంత్ర వీరులు. అల్లూరి బ్రిటీష్‌ వాళ్లకు మూడేళ్లు చుక్కలు చూపించారు. అయన ఉండే అడవిలోకి వచ్చేందుకు కూడా బ్రిటీష్‌ వాళ్లకు తడిసిపోయేది. కొమురం భీమ్‌ గోండు వీరుడు. జల్‌-జమీన్‌-జంగిల్‌ నినాదంతో నిజాం ప్రభుత్వానికి యుద్ధం అంటే ఏంటో చూపించిన వీరుడు. వీళ్లద్దరూ ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరి గుండెల్లో ఉన్న వీరులు. అలాంటి వీరుల కథకు ఫిక్షన్‌ తగిలించడం అంటేనే ఎబ్బెట్టుగా ఉంది. పోనీ మా సినిమాలో హీరోల పేర్లు అల్లూరి, భీమ్‌ అని చెప్పినా బాగుండేదేమో. ఒకవైపు వాళ్లిద్దరూ కలుస్తారు అంటన్నారు. మరో వైపు ఫిక్షన్‌ అంటున్నారు. ఈ కథపై రాజమౌళికి క్లారిటీ ఉందా? ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత జరిగిన ఓ ప్రెస్‌ మీట్‌లో కొందరు జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదనే అనిపిస్తోంది. బహుశా అల్లూరి, కొమురం భీమ్‌ల జీవితాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని రాజమౌళి కథగా మలుచుకొని ఉండవచ్చు. కానీ ఆ కథ కూడా రంప చోడవరం, జోడేఘాట్‌లతో ముడిపడిందే తప్ప ఎక్కడా ఢిల్లీ ప్రస్తావన ఉండదు. ఆ కథేంటంటే అల్లూరి సీతారామరాజు జీవించిన కాలం 1897 నుంచి 1924, కొమురం భీమ్‌ జీవించిన కాలం 1901 నుంచి 1940. అల్లూరి సీతారామ రాజు గారు 1920-24ల మధ్యలో రంప చోడవరం అడవుల్లో బ్రీటీష్‌ వ్యతిరేక యుద్ధం తీవ్రంగా సాగించారు. 1928 నుంచి 1940 వరకు భీమ్‌ నిజాం వ్యతిరేక పోరాటం చేశాడు. అంటే భీమ్‌ పోరాటం సాగించే సమయానికి అల్లూరి అసలు లేనేలేరు. వీర మరణం పొందారు. అక్కడే వస్తోంది కాన్‌ఫ్లిక్ట్‌. అయితే 1920లో భీమ్‌ సాగు చేసుకుంటున్న భూమి ఓ జమిందారు ఆక్రమించాడు. అప్పడు అతన్ని భీమ్‌ చంపేశాడు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు అసోం టీ తోటల్లో పనిచేశాడు. అంటే 1920 నుంచి 1925 వరకు భీమ్‌.. అస్సాంలో ఉన్నారు. అసోంలో ఉన్నప్పుడు భీమ్‌.. అల్లూరి సీతారామరాజు పోరాటం గురించి విన్నాడని.. అది అతనిలో ప్రేరణ నింపిందని.. ఆ తర్వాతే మళ్లీ ఆయన ఆదిలాబాద్‌ చేరుకున్నాడని ఓ కథ ఉంది. ఆయన సొంతూరు చేరుకున్నాక.. భీమ్‌ దారుణమైన పరిస్థితులు చూశాడు. పశువుల కాపర్లపై నిజాం పన్ను విధించాడు. పశువుల కాపర్లపై పన్ను భీమ్‌లో ఆవేశం రగిల్చింది. గిరిజనులను ఒక్క తాటిపై నడిపించి జోడేఘాట్‌ అడవుల్లో నిజాం వ్యతిరేక ఉద్యమం నడిపించాడు భీమ్‌. ఇదంతా 1925 తర్వాత జరిగిన ఘటన. అంటే అల్లూరి సీతారామరాజు వీరమరణం పొందిన తర్వాత కథ. 1940 అక్టోబర్‌ 27న భీమ్‌ కూడా వీరమరణం పొందాడు.ఇంత క్లియర్‌గా వారి పోరాటాల మధ్య టైమ్‌ గ్యాప్‌ కనిపిస్తోంది. మరి ఎంత

ఫిక్షన్‌లోనైనా టైమ్‌ ట్రావెల్‌ అయితే చేయలేం కదా. అల్లూరి-భీమ్‌ కలవడం అనే కాన్సెప్ట్‌లో థ్రిల్‌ ఉంది. కానీ ఆ థ్రిల్‌ కోసం… వారిద్దరి వీర చరిత్రను ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం మాత్రం తప్పు. ఇదే చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు రాజమౌళి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. సినిమా చూస్తారుగా మీకే తెలుస్తుంది అని ఆయన అంటున్నారు. సినిమా చూసినా చూడకపోయినా… అల్లూరి, భీమ్‌లో పోరాటాల చరిత్ర కాలాలు వేరైనప్పుడు, వారు పోరాడిన ప్రదేశాలు వేరైనప్పుడు, అసలు ఢిల్లీతో వారిద్దరికీ సంబంధమే లేనప్పుడు… చరిత్రలో లేని కథను చొప్పించి… ఆ ఫిక్షన్‌ కథలో అల్లూరి, భీమ్‌ లాంటి గొప్ప వీరులను వాడుకోవడం మాత్రం విమర్శలకు దారులు తెరిచేదే.ఈ కాంట్రవర్శీలు కూడా ఆయన సినిమా ప్రమోషన్‌ను పెంచుతున్నాయి. బహుశా.. అదే రాజమౌళీ స్ట్రాటజీ కూడా కావొచ్చు. సినిమాలో రాజమౌళి చూపించిన కాలం ఏంటో కూడా చెప్పడం లేదు. మొత్తానికి తన RRR సినిమాలో అల్లూరిని, భీమ్‌ని…. తన ఫిక్షన్‌ కథలో ఎలా వాడుకున్నారో.. ఎలా చూపించారో… సినిమా చూస్తే గాని తెలియని కన్ఫ్యూజన్‌ని రాజమౌళి సక్సెస్‌ఫుల్‌గా సృష్టించారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *