June 7, 2023

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది – కేజ్రీ, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది – కేజ్రీ, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం

దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వటం సాధ్యం కాదని, పరిపాలన పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ల మధ్య అధికార హోదా విషయంలో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం 2017 డిసెంబర్‌ 6వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.

ధర్మాసనం తీర్పులో ముఖ్యాంశాలివి…
రాజ్యాంగాన్ని గౌరవించటం, రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత.
లెఫ్టినెంట్ గవర్నర్ తన ఇష్టానుసారం వ్యవహరించలేరు. క్యాబినెట్ సలహా, సంప్రదింపులతోనే వ్యవహరించాలి.
గతంలో తొమ్మిది మంది సభ్యుల విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వటం సాధ్యం కాదు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకునే విధంగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించకూడదు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది.

ఈ వివాదం పూర్వాపరాలివి. దిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. దిల్లీని లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కూడా పరిపాలిస్తారు. ప్రస్తుతం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్. ముఖ్యమంత్రి ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్. దిల్లీ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉండే భూమి, కార్యనిర్వాహక శాఖలు, పోలీసులపై దిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలూ ఉండవు. తన ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్ అధికారులు తన ఆదేశాలు పాటించడం లేదని తొమ్మిది రోజుల పాటు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో కేజ్రివాల్ నిరసన దీక్ష చేశారు. కొన్నాళ్లుగా లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం మధ్య అధికారాల విషయంలో వివాదం నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న పాలకులను గవర్నర్ తక్కువ చేస్తున్నారన్నది కేజ్రివాల్ ఆరోపణ. ఈ విషయంపై న్యాయస్థానాన్నికూడా ఆశ్రయించారు. దిల్లీ పరిపాలకుడు లెఫ్టినెంట్ గవర్నరేనని గతంలో దిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ కేజ్రివాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తాాజా తీర్పు వెలువరించింది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *