June 7, 2023

ప్రశ్న ఎప్పుడూ విజ్ఞానమే. అసలు ప్రశ్న లేకపోతే ప్రపంచం లేదు. ఈ విశ్వం లేదు. వేదం ఆ ప్రశ్నకు సమాధానం. వేదాల్లో అర్థం కాని మంత్రాలు ఉన్నాయంటారు. వేదాన్ని విమర్శించేవారిలో నూటికి 99 మంది వేదం తెలియనివారే. మొదటి ఋక్కుని కూడా వినిపించలేని వారే (వేద పండితులను మినహాయించి ఈ లెక్క). ఒక వేళ వినిపించినా అసలు అర్థం చెప్పే జ్ఞానం లేక.. వాళ్లకు నచ్చిన అర్థం చెప్పి అదే కరెక్టని వాదించే అరకొర జ్ఞానమే ఎక్కువ. వేదం పూర్తిగా నేర్చుకోడం ఇప్పుడున్న జీవన విధానంలో కష్టమే. ఒక్కో వేదాన్ని అర్థ సహితంగా నేర్చుకోవాలంటే 12 ఏళ్లు.. అలా 4 వేదాలకు సుమారు 35 ఏళ్లు పడుతుంది. ఇప్పుడు మన ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ, డాక్టరేట్‌లా అన్నమాట. అందుకే సబ్జెక్ట్‌ పరంగా ఫలానా విద్యార్థికి ఏ వేదం అవసరమో అది నేర్పేవారు గురుదేవులు. కానీవేదం మన జీవన విధానానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం అందరికీ ఉంది. అది ప్రపంచ శాంతిని కోరింది. ‘సర్వేజనా సుఖినోభవంతుఅనే సోషలిజం పాఠాన్ని ఎన్నో వేల ఏళ్ల క్రితమే చెప్పింది. నాగరికులం అని విర్రవీగుతూమనం చెప్పిందే కరెక్ట్‌ అనే పెద్ద భ్రమలో బతుకుతున్న ఈ ప్రపంచంలో నేడు కనిపిస్తున్న మత వైషమ్యాలు, కులాలు కుమ్ములాటలు వేద కాలంలో కనిపించవు. ఎందుకంటే అప్పటికి మతం లేదు, కులం లేదు . ఉన్నదల్లా జీవన విధానం.. అదే వేదజీవనం. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి, నూరేళ్లు ఆరోగ్యంతో బతికి, ఉన్నన్నాళ్లు ఆనందంగా బతకాలి.. అలా బతకడానికి ఏం కావాలి..? ఇదే వేదం చెప్పింది. ఆనందమయ జీవితాన్ని కోరింది వేదం. పుడమిపైనే స్వర్గాన్ని ఎలా నిర్మించుకోవచ్చో చెప్పిన వ్యక్తిత్వ వికాస పాఠం వేదం. మొదట్లో వేదం ఒకటే. ఆ ఒక్కటి ప్రజలకు చేరువ కాదు అనే ఉద్దేశంతోనే విష్ణువు వ్యాసుడయ్యాడు. ఒక్క వేదాన్ని సబ్జెక్ట్‌ వైజ్‌గా నాలుగు చేశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వ వేదం, సామవేదం. నాలుగు వేదాల్లో ఉన్న విస్తార సారాన్ని నాటి మహర్షులు 20 వేలకు పైగా మంత్రాలుగా దర్శించారు. దర్శించడం అని ఎందుకు వచ్చిందో తర్వాత తెలుసుకుందాం. వేదాలు సామాన్యులకు అర్థం కావేమోనని ఆ సారాన్ని ఉపనిషత్తుల్లో చెప్పారు. ఉప అంటే దగ్గర అని అర్థం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఉపనిషత్తు అంటే అర్థం గురువు దగ్గరగా ఉండి జ్ఞానం తెలుసుకోవడం. “వేదాలకు అంతంఅంటే చివరన వస్తాయి కాబట్టి ఉపనిషత్తులే వేదాంతాలయ్యాయి. ఆ ఉపనిషత్తులు కూడా సామాన్యులు నేర్చుకోలేరేమో అని వేదాల్లో ఉన్నదంతా కథల్లోకి మార్చి 18 పురాణాలు చేశారు. వాటినే అష్టాదశ పురాణాలు అన్నాం. కథలు చదవడం, చెప్పడం సులువు కదా.. అందుకని. ఇక పురాణాలు కూడా కష్టమవుతాయేమో అని ఇతిహాసాలు అందించారు. మనిషి ఎలా బతకాలో చెప్తుంది రామాయణం, మనిషి నాశనానికి కారణాలు చెప్తుంది మహాభారతం. వస్త్రాపహరణం మహాభారతంలో మాత్రమే జరిగిందనుకుంటారు అంతా. కానీ, జూదానికి భార్యలను పందెంగా పెట్టే దుష్ట సంప్రదాయం మహాభారత కాలానికి ముందు నుంచే ఉండేది. అతివ జోలికొస్తే కురుక్షేత్రం తప్పదని శ్రీ కృష్ణావతారం చెప్తే, ఆడవారిని జూదంలో పందెంగా పెట్టే కుసంప్రదాయానికి చరమగీతం పాడిన తొలి విప్లవ వనిత ద్రౌపది. ఆ ఈ రెండు ఇతిహాసాల మూలాలు వేదాలు. ఇతిహాసాలు కూడా కొంతమందికి చేరువ కావేమోననిపండుగలు రూపొందించారు. మన కర్మభూమిలో నిత్యం ఏదో ఒక పండగ. ఆ పండగలో మన జీవన విధానానికి సంబంధించిన అంశాలు. ఆరోగ్యాన్ని పెంచే ప్రసాదాలు. ఇలా రూపొందించారు మన ఋషులు. ఇంతకన్నా విస్తృతమైన జీవన విధానం మనకు ఎక్కడా కనిపించదు.నిత్యం పూజలు.. ఇంటిలో ఉన్న చీకటిని తొలగించేందుకు ముందు దీపం, ఇంట్లో చెడువాసన తొలగించేందుకు ధూపం, సువాసన కలిగిన పువ్వులతో దేవుడికి అలంకారాలు. ఇల్లు శుభ్రంగా ఉంటే ఆలోచనలు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. (దీనికే ఆ తర్వాత అంటే వేదం పుట్టిన వేల ఏళ్ల తర్వాత ఈ మధ్యేసైకాలజీ అని పేరు పెట్టారు‌). ఆ తర్వాత ప్రకృతి ప్రసాదించిన పంచామృతాలు తీర్థంగా ఖాళీ కడుపుతో తీసుకోడం ( తేనె, నీళ్లు తాగితే మంచిదని ఏదో కొత్తగా కనిపెట్టినట్టు ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారువేల ఏళ్లుగా అది మన గుడిలో అది తీర్థం), ఆరోగ్యాన్ని హితవైన ప్రసాదాలు, ఆ ప్రసాదాన్ని దేవుడికి ఆరగింపు చేసేటప్పుడు ఇంట్లో వాళ్లను లేవండని మేలుకొలిపే చిరుగంట, లేస్తూనే నిద్రమత్తుని తొలగించే కర్పూర హారతి, ఎన్నో బ్యాక్టీరియాలను ఆదిలోనే నిరోధించే తులసి చెట్టుని ప్రధమ వైద్యుడిగా ఆరాధిస్తూ పూజ (వైద్యుడుని దేవుడిగా పూజిస్తే అది చాదస్తమా? అది వైద్యుడికిచ్చే గౌరవమా? ). వీటితో పాటు ఎన్నో. వైదిక ధర్మాన్ని కరెక్ట్‌గా పాటిస్తే చాలా హాస్పటల్స్‌ మూసుకోవాలి. లేని రోగాలను సృష్టించిన వైద్య నాగరికత మనది, పోనీ, సృష్టించిన ఆ రోగాలకు మందులు కనిపెట్టలేకపోతున్న విజ్ఞానం మనది. రోగాలు వచ్చిన తర్వాత మందులు తయారు చేసుకునే సైన్స్‌ విదేశీయులది. అసలు రోగమే రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధానాన్నిప్రతీ రోజు మన జీవన విధానంలో పూజగా చేసిన అత్యాధునిక వైద్య సాంకేతికత మన వేదానిది. ఇప్పుడు Prevention is Better than Cure అని ఎంత ఆలస్యంగా తెలుసుకున్నాం. వేల ఏళ్ల ఆలస్యం. మరి ఆయుర్వేదం గొప్పదావిదేశీ వైద్యమా? అందుకే ప్రపంచంలో అన్ని దేశాలు ఆనాడు భారతదేశాన్ని ఒక్క సారి చూడ్డానికి తహతహలాడాయి. ఈర్ష్యతో ఇక్కడి విధానాలను నాశనం చేసేందుకు కుట్రలు చేశాయి. చేస్తూనే ఉన్నాయి. అయినా పొద్దున్నే లేవగానే దేవుడికి దండం పెట్టకుండా బయటకు కదలం, నా దేశంలో గాయత్రి మంత్రం వినిపించని ప్రాంతం ఉండదు. వీధి చివరన కనిపించే చిన్నగుడిలో కూడా దీపం కనిపించని పొద్దు లేదు. ఇదీ మన వేదం గొప్పదనం. ఇది తొలి ఆర్టికల్‌గా ఇంట్రడక్షన్‌గా రాసినది. ఇక్కడి నుంచి మన వేదాల్లో అద్భుతమైన సాంకేతీకత, ప్రపంచానికి వేదం ఏం అందించింది? ఉపనిషత్తులు చెప్పిన సత్యాలేంటి? పురాణాలు ఏం చెప్తున్నాయి?.. తర్వాత భాగంలో చూద్దాం.

సతీష్‌ కొత్తూరి

 

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *