June 7, 2023

కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన వేదం- 3వ భాగం

కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన వేదం- 3వ భాగం

అసలు ఓంకారం అనేది ఉందా? మన హైందవ సంప్రదాయంలో ప్రతీ మంత్రం ముందు ఓంకారం ఎందుకు? ఓం అని పలికితే ఆ మంత్రనాదం ఎవరిని ఉద్దేశించి పూజిస్తున్నట్టు? ఓంకారం ఎక్కడిది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తేనే వేదం గురించి మాట్లాడుకోగలుగుతాం. పక్క నుంచి సడెన్‌గా రైలు వెళ్తే ఆ శబ్దానికి ఉలిక్కి పడతాం. ఎక్కడో అంత ఎత్తులో విమానం వెళ్తుంటే ఆ శబ్దం మనింట్లో వినిపిస్తుంది. ఫిజిక్స్‌ ప్రకారం ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు శబ్ద తరంగాలు ఏర్పడతాయి. వినిపించాలంటే గాలి లాంటి మీడియం ఉండాలి. ఎందుకంటే శూన్యంలో మీడియం ఉండదు కాబట్టి శబ్దం వినిపించదు. ఈ థియరీ అందరికీ తెలిసిందే కదా. మరి.. అంత పెద్ద పెద్ద గ్రహాలు, నక్షత్రాలు.. అతివేగంగా విశ్వమంతా తిరుగుతుంటాయి. తమ చుట్టూ కూడా అవి తిరుగుతాయి. ఒక రాయికి తాడు కట్టి గిరాగిరా తిప్పితే జుయ్‌.. అని శబ్దం వస్తుంది కదా. మరి.. వేగంగా తిరుగుతున్న గ్రహనక్షత్రాల నుంచి నుంచి కూడా శబ్దం రావాలి. పైగా నిత్యం మన విశ్వంలో నక్షత్రాలు పేలుతూ ఉంటాయి. ఆ పేలుడు.. కొన్ని వేల న్యూక్లియర్‌ బాంబులు పేలినట్టు. ఎంత శబ్దం రావాలి? ఆ శబ్దతరంగాలన్నీ ఏమవుతున్నాయి ? విశ్వమంతా విస్తరించిన ఆ కాస్మిక్‌ శబ్దాలన్ని కలిసి ఏర్పడిన మహాశబ్దమే.. ఓంకారం. అదే ఈ విశ్వం నుంచి వెలువడిన తొలిశబ్దం. ఈ విశ్వం ఉన్నంతవరకు కొనసాగే శబ్దమూ అదే. విశ్వం నుంచి పుట్టిన చిన్న కణమే మన భూమి. అంటే ఈ విశ్వ మూలం.. మన నేలతల్లికి అమ్మ. అందుకే ప్రతిరోజూ ఓంకారం.. భూమితో మాట్లాడుతుంది. భూమిపై ఉన్న మనందరం ఓంకార పంజరంలో ఉంటాం. విశ్వానికి, మనకి ఉన్న వైర్‌లెస్‌ కనెక్షన్‌ ఓంకారం. మరీ ఈ వివరణకు సైంటిఫిక్‌ ఆధారాలున్నాయా? మనోళ్లలో కొంతమందితో ఓ చిక్కుంది. మన ఇండియన్స్‌ ఏదైనా కనిపెట్టారని అనుకోండి. ఎందుకో మన మనసు ఒప్పుకోదు. ఓ వందైనా లాజిక్కులు తీస్తాం. అదే ఏ విదేశీయుడో అదే విషయాన్ని చెప్పాడనుకోండి.. అబ్బో అంటాం. అంతే పొరుగింటి పుల్లకూరే 
మనకు బిర్యానీ. అందుకే మన ఋషుల అద్భుత జ్ఞానం మెట్టవేదాంతమైంది. నేను కూడా ఈ థియరీనే ఫాలో అయిపోతాను.
ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త “నికొలాస్ టెశ్లా“ గురించి కాస్తైనా తెలుసుకోవాలి. ఫిజిక్స్‌ చదువుకున్న ఏ స్టూడెంట్‌కైనా టెశ్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ రోజున మనం స్విచ్‌ వేస్తే లైట్‌ వెలుగుతోంది, ఫ్యాన్‌ తిరుగుతోంది. మోటర్ వేస్తే నీళ్లు వస్తున్నాయి. వీటన్నిటికీ శక్తి ఆల్టర్నేటింగ్ కరెంట్‌. ఆల్టర్నేటింగ్ కరెంట్‌ సృష్టికర్త నికోలాస్‌ టెశ్లా. ప్రస్తుత పరిస్థితిలో ఒక్క క్షణం కరెంట్‌ పోతే.. “ .. ఈ టైంలో తీశాడేంట్రా బాబూఅని ఏ టైంలోనైనా అంటుంటాం. అలా మన జీవితంలో కరెంట్‌ విడదీయరాని భాగమైపోయింది. ఆల్టర్నేటింగ్ కరెంట్‌ లేకపోతే ఇండస్ట్రీసే లేవు. అలాంటి ఆధునిక నాగరికతను ఇచ్చిన మహనీయుడు టెశ్లా. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా ఓ దశలో థామస్‌ అల్వా ఎడిసన్‌ని మించిపోయిన మేధావి టెశ్లా. రేడియోపై విస్తృత పరిశోధనలు చేశారు. వందల పేటెంట్లు, వేల ఆవిష్కరణలు. వీటిలో ఏసీ మోటార్లు, మన ఇళ్లల్లో భాగమైపోయిన ట్యూబ్‌లైట్లు, కరెంట్‌ ప్రొడక్షన్‌కి కీలకమైన స్టీమ్‌ టర్బైన్స్‌, వైర్‌లెస్‌ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్‌, రిమోట్‌ కంట్రోల్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ ఇలా అన్నీ అద్భుతాలే. యుగస్లావియాలో పుట్టి.. జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలలో పనిచేశారు టెశ్లా. మరో విఖ్యాత శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌తో కొన్నాళ్లు పనిచేసి.. తర్వాత శాస్త్ర విబేధాల వల్ల విడివిడిగా పరిశోధనలు మొదలు పెట్టారు. వారిద్దరూ విడిపోడమే ప్రపంచానికి మంచి జరిగింది. ఎడిసన్‌ కనుగొన్న డైరెక్ట్‌ కరెంట్‌ (DC)కి ప్రత్యామ్నాయంగా టెశ్లా ఆల్టర్నేటింగ్ కరెంట్‌ (AC) ని అప్పుడే కనుక్కొన్నారు. అది ప్రపంచాన్ని మార్చేసింది. టెశ్లా పేరు ప్రపంచమంతా మారుమోగింది. అసలు వైర్లే లేకుండా వైర్‌లెస్‌ కరెంట్‌ సప్లై గురించి ఆరోజుల్లో ఆలోచించాడు. ఆల్‌మోస్ట్‌ పరిశోధన కూడా పూర్తిచేశాక.. కొన్ని అవాంతరాల వల్ల ఆగిపోయిందట. అంతటి మహానుభావుడాయన. ఇది టెశ్లా గురించి సంక్షిప్త పరిచయం. ఓంకారానికి ఈ విదేశీ శాస్త్రవేత్తకి ఏం సంబంధం అంటారా? ఇప్పుడక్కడే వచ్చాను. ఈ పరిశోధనల తర్వాత టెశ్లాకి 1890ల్లో రేడియో మీద ఆసక్తి కలిగింది. కొలరాడో స్ప్రింగ్‌ అనే ప్రాంతంలో ఒక పెద్ద వైర్‌లెస్‌ టవర్‌ని నిర్మించారు. అక్కడే మొదలైంది మన ఓంకారం కథ. మన భూమి అవతల, విశ్వంలో ఇంకా ఏముంది? వేరే గ్రహాల్లో మన లాంటి జీవులున్నాయా? ఉంటే వారి సాంకేతిక పరిజ్ఞానం ఏంటి? వేరే గ్రహం మీద జీవమంటూ ఉంటే వాళ్లతో మనకు కమ్యూనికేషన్‌ కుదురుతుందా? ఇవే ఆ రేడియో టవర్‌ పరిశోధనా లక్ష్యాలు. ఒక వేళ గ్రహాంతరవాసులుంటే ఏదో ఒక సంకేతం అందకపోతుందా అన్న ఆశతో స్పేస్‌ నుంచి వచ్చే రేడియో తరంగాలను విశ్లేషించడం మొదలు పెట్టారు టెశ్లా. అందుకు కొంత మంది ఉద్యోగులు ఉండేవారు. ఈ పరిశోధనల్లో గ్రహాంతరవాసుల నుంచి సంకేతాలేవీ అందలేదు. కానీ, ఎప్పుడూ ఓ రేడియో డిస్ట్రబెన్స్ వచ్చేది. ఎక్విప్‌మెంట్‌లో ఏమైనా ప్రాబ్లెం ఉందేమోనని చూశారు. అదేమీ లేదు. తుఫానులు లాంటి సంకేతాలా అంటే అవి కాదని తేలిందట. ఆ శబ్దం మీద మరింత రీసెర్చ్‌ చేశాడు టెశ్లా. చివరికి తేలిందేంటంటే.. అది భూమి నుంచి వస్తున్న శబ్దం కాదు.. భూమి వెలుపల నుంచి వస్తున్న శబ్దం. పోనీ గ్రహాంతరవాసులే ఈ సంకేతాన్ని పంపిస్తున్నారా అన్నకోణంలో ఆలోచిస్తే అది కాదని తేలింది. ఎందుకంటే ఒకే ధ్వని.. ఒకే ఫ్రీక్వెన్సీలోనిరంతరంగా.. నిర్విరామంగా.. ఒక హమ్మింగ్‌లా వినిపించడాన్ని టెశ్లా గమనించి రికార్డ్‌ చేశాడు. “ విశ్వంలో భూమి తిరుగుతూ ఉండడం వల్ల భూమి నుంచి ఈ శబ్దం వస్తోందిఅని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చాడు టెశ్లా. ఆ తర్వాత స్పేస్‌ రీసెర్చ్‌లోనే తన శేషజీవితం గడిపేశాడు. కానీ, ఈ పరిశోధనని 1935లో మరో ప్రముఖ శాస్త్రవేత్త కొనసాగించాడు. ఆయనే కార్స్‌ జెన్‌స్కీ. విశ్వాంతరాళం నుంచి వస్తున్న ఈ హమ్మింగ్‌ నిజమేనని.. అయితే అది భూమి తిరగడం వల్ల వస్తున్న శబ్దం మాత్రమే కాదనిఈ హమ్మింగ్ విశ్వమంతా వ్యాపించి ఉందని.. విశ్వం మధ్యభాగం (కోర్‌‌) నుంచి మరింత ఎక్కువ ఈ హమ్మింగ్‌ వస్తోందని ససాక్ష్యంగా నిరూపించాడు. అంతే కాదు ఈ హమ్మింగ్‌ విషయం భారతీయులకు ఎప్పుడో తెలుసని కూడా కంక్లూజన్‌ ఇచ్చాడు. 1935, జూలై 3.. ప్రఖ్యాత మిచిగన్ యూనివర్శిటీలో.. నేషనల్‌ కన్వెన్షన్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ రేడియో ఇంజనీర్స్‌ విభాగంలో జెన్‌స్కీ తన పరిశోధనా పత్రాన్ని కూడా సమర్పించాడు. ఈ వివరణతో మనకో విషయం స్పష్టంగా అర్థమవుతోంది. విశ్వమంతా ఒక శబ్దం ఆవరించింది. విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు, విశ్వపదార్థాల భ్రమణాల వల్ల ఆ సౌండ్‌ వస్తోంది. కోర్‌ ప్రాంతంలో ఎక్కువగా ఉందంటే.. ఆ ప్రాంతం (బ్రహ్మాండం) నుంచి విశ్వ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ ధియరీనే ఆధునిక పరిభాషలో బిగ్‌బ్యాంగ్‌ అంటున్నాం. ఆ శబ్దాన్నే వేదకాలంలో మన ఋషులు గ్రహించారు. మన ఋగ్వేదంలో పదవ మండలంలో ఉన్న నారాయణ సూక్తం విశ్వ ఆవిర్భావాన్ని వివరిస్తుంది. నిరంతరంగా, అఖండితంగా వస్తున్న ఆ శబ్దం గురించి విష్ణు పురాణం స్పష్టంగా చెప్పింది. ఆ శబ్ద సంకేతమే ఓంకారం“. మంత్రానికి మూలం. ఈ విశ్వమంతటికీ కారణ బీజమైన పరమాణువే పరాత్పరుడు. ఆ పరమాణు విచ్ఛిత్తే విశ్వరూపం. ఆ విచ్ఛిత్తి శబ్దమే ఓంకారం. ఇదీ మన వేదానికి మూలం.
మరి, ఆ శబ్దాన్ని మనమెందుకు వినలేం?
20-20000 hz
ఫ్రీక్వెన్సీల మధ్య శబ్ద తరంగాలను మాత్రమే మనం వినగలం. 20 hz కన్నా తక్కువున్న ఇన్‌ఫ్రా సౌండ్‌ని వినలేం కానీ.. ఎక్కువ ఆంప్లిట్యూడ్‌ ఉంటే ఆ శబ్ద తరంగాల స్పర్శ తెలుస్తుంది. 20,000 hz కన్నా ఎక్కువఅంటే 3 గిగా hz వరకూ వుండే తరంగాలు రేడియో వేవ్స్‌. ఆ పైన 3 నుంచీ 300 గిగా hz దాకా మైక్రో వేవ్స్‌. ఆ పైన ఇన్‌ఫ్రా రెడ్, ఇంకా పైన లైట్‌ వేవ్స్‌, ఆ పైన అల్ట్రా వైలెట్లు, ఎక్స్రేలు, గామా రేడియేషన్లు ఇదీ వేవ్‌ ఫార్మాట్‌. వస్తువు లేదా కణాల కదలిక వల్ల శబ్ద తరంగాలు ఏర్పడతాయని చెప్పుకున్నాం. ఆ శబ్దం వినిపించాలంటే గాలి లాంటి వాహకం కావాలి. మన విశ్వమంతా శూన్యమే. అందువల్ల వాహకం లేక శబ్దం నశించిపోతుంది. ఇక.. శక్తి ఉన్న కణాల కదలిక వల్ల రేడియో వేవ్స్‌ ఏర్పడతాయి. ప్రతి నక్షత్రం నుంచీ అణు విస్ఫోటనం జరుగుతుంది. అక్కడి నుంచి చార్జి వస్తుంది. అలా ఛార్జైన కణాల నుంచి ఏర్పడే రేడియో తరంగాలకు వాహకం అవసరం లేదు. కనుక ఇవి విశ్వమంతా ఉన్నాయి. సృష్టి ఏర్పడినప్పుడు ( బిగ్‌బ్యాంగ్‌ సమయంలో) రేడియో తరంగాలు పుట్టాయి. ఇప్పటికీ ఆ రేడియో వేవ్స్‌ విశ్వమంతా ఆవరించి ఉన్నాయి. టెశ్లా పరిశోధనల్లో వినిపించిన హమ్మింగ్‌ వేవ్స్‌.. రేడియో వేవ్స్‌కి సంబంధించినవే. రేడియో వేవ్స్‌ని మనం వినలేం కదా. అందుకే ఆ హమ్మింగ్‌ మనకు వినిపించడం లేదు. ఇది పూర్తిగా సైంటిఫిక్‌ రీసెర్చ్‌. ఒక వేళ వినగలిగినా వేల గిగా hzల సౌండ్‌.. విశ్వం విస్తరిస్తున్నప్పుడు అఖండితంగా వస్తున్న శబ్దం విని తట్టుకోగలమా? ఆ శబ్దాన్ని వినాలన్నా, తట్టుకోవాలన్నా ఒకటే మార్గం. అది యోగం, తపస్సు, ఇంద్రియ నిగ్రహం. అందుకే, వేదకాలం ఋషులకు ఆ దైవిక శబ్దం వినిపించింది. ఆ స్పర్శకు వారి ఒళ్లు ఝల్లంది. సృష్టిస్థితిలయ కారకుడి మాటే.. ఆ శబ్దమని.. అది మూలమంత్రమని.. ఆ శబ్దాన్ని ట్రాన్స్‌క్రిప్ట్‌ చేసి ఓంఅని గ్రహించి అత్యద్భుతమైన స్పేస్‌ ఫిజిక్స్‌ పాఠాన్ని అందిచారు మన వేదకాల శాస్త్రవేత్తలు. మన శరీరంలో కూడా ఓంకారం ఉంది. ఓంకారం రేడియో వేవ్స్‌ అని చెప్పుకున్నాం. మనలో ఓంకారం అనే రేడియేషన్‌ ప్రవహిస్తోంది. సాధారణంగా శరీరంలో రేడియేషన్‌ ఎక్కువైతే ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. అందుకే ఆ రేడియేషన్‌ని తగ్గించుకుని శరీరానికి అవసరమైన సృష్టిశక్తిని స్థిరంగా ఉంచడానికి ఓంకార మంత్రం పఠనం చేస్తాం. అలా .. విశ్వాంతరాళం నుంచి విడుదలైన రేడియేషన్‌ని మన శరీరంలో కంట్రోల్‌ చేసే థెరపీ ఓంకారం. అందుకే వేద కాలం నుంచి ఇప్పటి వరకు మన సంప్రదాయంలో ఓంకారం ఆది మంత్రంగా వర్థిల్లుతోంది. యోగ సాధనకు మూలమంత్రమై విరాజిల్లుతోంది. మీరు నిశ్చలంగా కూర్చుని కనీసం ఓ పదినిమిషాలు ఓంకారం వినండి చాలు.. మీ మానసిక స్థితిలో మార్పుని ఇన్‌స్టంట్‌గా చూస్తారు. కారణం.. ఈ భూమి (ఎర్తింగ్‌) నుంచి.. మీ కాళ్ల ద్వారా.. ఆరు ప్రాణ చక్రాల ద్వారా.. మీ శరీరంలో ప్రవహించే ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఎనర్జీ+రేడియేషన్‌ని నియంత్రించి సమతుల్యం చేయగల రెగ్యులేటర్‌ ఓంకారం. ఓం అనడం ద్వారా అనడం ద్వారా 400 hzలపైనే శక్తిని మీరు విడుదల చేస్తారు. వినడం ద్వారా 200 hzల శబ్దశక్తిని ఎమిట్‌ చేయగలుగుతారు. తద్వారా.. మీ శరీరంలో నాభి నుంచి మెదడు వరకు ప్రతీ కణం, ప్రతీ చక్రం వైబ్రేట్‌ అవుతుంది. ఆ వైబ్రేషన్‌ నుంచి వెలువడిన శబ్ద తరంగాలు మళ్లీ ఈ ప్రకృతిలో కలిసిపోతాయి. మీ శరీరంలో శక్తి సమతుల్యమవుతుంది. ఇలా రోజూ చేస్తేఇక మానసిక, శారీరక సమస్యలకు అవకాశం ఎక్కడుంది చెప్పండి? ఇది మన సనాతన భారతీయ యోగశాస్త్రం మనకిచ్చిన అద్భుత వరం.. అదే ఓంకారం. వేదానికి ఆధారం. ఇక్కడి వరకు విదేశీయులు చేసిన పరిశోధనల్లో అనుకోకుండా తారస పడిన ఓంకారం గురించి చెప్పుకున్నాం. ఇక వచ్చే ఆర్టికల్‌లోవిశ్వ ఆవిర్భావం, ఆ అవిర్భావాన్ని వివరించే శ్రీచక్రం, అక్కడి నుంచి ఓంకారం ఎలా ఏర్పడింది, వేదంలో రమణీయ ఋక్‌మంత్రం నారాయణ సూక్తంలో సృష్టి ఆవిర్భావం గురించి ఏం ఉంది? … “విశ్వరూపం గురించి వేదం ఏ చెప్తోంది..? ఈ వివరాలు చెప్పుకుందాం.

సతీష్‌ కొత్తూరి

 

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *