అటు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ప్రచ్ఛన యుద్ధం నడుస్తున్న వేళ.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం చైనాకు మింగుడు పడకపోవచ్చు. మోడీ మ్యాజిక్ అందామో, అమెరికా వ్యూహాత్మక అడుగు అందామో.. ఏదైనా… భారత్, అమెరికా సంబంధాల్లో ఇదో పెద్ద ముందడుగు. కేవలం నాటో దేశాలకు మాత్రమే ఇచ్చే strategic trade authorization STA-1 (వ్యూహాత్మక వాణిజ్య హోదా)ని భారత్‌కు ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల… అమెరికా మిత్ర దేశాలు పొందే రాయితీలన్నీ భారత్‌కు అందుతాయి. ముఖ్యంగా సైనిక ఆయుధాల విషయంలో భారత్‌కి ఇది కీలక మలుపు. చాన్నాళ్ల నుంచి భారత్–అమెరికా రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ ఎక్సేంజ్ విషయంలో చైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఒబామా టైంలో కూడా అమెరికాతో సైనిక ఆయుధాల విక్రయాలకు అడ్డుపడింది. ఈ నిర్ణయంతో చైనా కూడా ఇక మాట్లాడే పరిస్థితి లేదు. ఒక రకంగా చైనాకు చెక్ చెప్పేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఒబామా సమయంలోనే రక్షణ వ్యవస్థలో భారత్‌కు కీలక భాగస్వామి హోదా ఇచ్చారు కానీ చట్ట సవరణ కాలేదు. పెండింగ్‌లో ఉన్న చట్టసవరణలకు చర్యలు ప్రారంభమయ్యాయి. STA హోదాలో చేరిన ఏకైక దక్షిణాసియా దేశం భారత్. STA-1 జాబితాలో ప్రస్తుతం 36 దేశాలున్నాయి. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలకు కూడా అమెరికా ఈ హోదా ఇచ్చింది.
STA-1 వల్ల ప్రయోజనాలివి..
భారత్‌కు ఎగుమతి చేసే హైటెక్ ఉత్పత్తులకు ఎగుమతి నియంత్రణలు సడిలిస్తారు
ఎగుమతుల లైసెన్సుల ఖర్చు సగానికి సగం తగ్గిపోతుంది
నాటో దేశాలతో సమానంగా భారత్‌కు హోదా
అమెరికా అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీ పొందే అవకాశం
ఆ దేశ అధునాతన టెక్నాలజీని మనం కొనుగోలు చేయవచ్చు